దాదాపు 25 సంవత్సరాలకు పైగా తెలుగు సినిమా రంగంలో తనదైన పాటల బాణీలతో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న కీరవాణి గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర సహాయకుడుగా పనిచేసిన నాటి నుండి ఈనాడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన స్థాయి వరకు ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీతం సమకూర్చిన గొప్పతనం కీరవాణిది. 

అయితే అటువంటి కీరవాణి నిన్న ‘బాహుబలి 2’ మ్యూజిక్ విడుదల సందర్భంగా పెట్టిన కొన్ని ట్విట్స్ చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్న లోపాలను గురించి ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ గా కామెంట్స్ చేయడం బాగానే ఉన్నా ఏకంగా తెలుగు సినిమా రంగాన్ని అవమాన పరిచేలా ఒక వివాదాస్పద వ్యక్తిగా మారిపోయి ఘాటైన కామెంట్స్ చేయడంలోని ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బుర్రలేని దర్శకులు ఉన్నారు అని కీరవాణి కామెంట్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే తెలుగు సినిమా రంగంలో ఫలానా దర్శకుడుతో తనకు భేదాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పడం బాగానే ఉంటుంది కాని మొత్తం సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తూ కీరవాణి కామెంట్స్ చేయడం ఎంతవరకు సమంజసం అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 

తెలుగు సినిమా రంగ ఖ్యాతిని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకు వెళ్ళిన దాసరి రాఘవేంద్రరావు లాంటి ఎందరో గొప్ప దర్శకుల వద్ద పనిచేసిన ఖ్యాతి కీరవాణి సొంతం. దీనికితోడు ఇప్పటికీ తెలుగు సినిమా ఇమేజ్ ని పెంచుతున్న ఎందరో యువ దర్శకులు తెలుగులో సినిమాలు తీస్తూనే ఉన్నారు. 

అయితే ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో చాలామంది దర్శకులకు బుర్రలేదు అనే ఘాటైన కామెంట్స్ కీరవాణి ఎందుకు చేసాడో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. బహుశా కీరవాణి దృష్టిలో రాజమౌళికి తప్ప మరెవ్వరికి బుర్రలేదు అని ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: