పవన్ కళ్యాణ్ తమ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తే చాలు కోట్లు కురిపించడానికి కార్పోరేట్ కంపెనీలు ఎదురు చూస్తూ ఉంటాయి. అదేవిధంగా పవన్ ను అతిధిగా వస్తే చాలు అని కోరుకునే ఎంతోమంది భారీ ఫంక్షన్స్ నిర్వాహకులు ఉన్నారు. అయితే ఈ విషయాలు ఏమి పవన్ పట్టించుకోడు. మెగా కుటుంబ వేడుకలను కూడ లెక్క చేయని పవన్ వ్యక్తిత్వం వల్ల చివరికి చిరంజీవి సైతం పవన్ రాక కోసం ఎదురు చూసి నిరాశ చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

అటువంటి పరిస్థుతులలో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక చిన్న ‘సెలూన్’ ప్రారంభోత్సవానికి పవన్ అతిధిగా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రారంభం అయిన ‘సెలూన్ కొనికి’ ప్రారంభోత్సవానికి అతిధిగా పవన్ రావడంతో చాలామంది షాక్ అయ్యారు. అయితే ఇలా పవన్ ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి రావడం వెనుక ఒక కారణం ఉంది. 

పవన్ కు ‘గోపాల గోపాల’ సినిమా దగ్గర్నుంచి హెయిర్ స్టైలిస్టుగా పని చేస్తున్న రామ్ కొనికి అనే అతను ‘సెలూన్ కొనికి’ పేరుతో ఒక సెలూన్ ఓపెన్ చేశాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి రావాలని రామ్ పవన్ ను కోరగా మరో ఆలోచన లేకుండా అంగీకరించాడు అని టాక్. 

దీనితో పవన్ తన చేతుల మీదుగా సెలూన్ ను ప్రారంభించడంతో ఆ హెయిర్ స్టైలిస్ట్ ఆనందానికి అవధులు లేవు. ఒక వైపు త్రివిక్రమ్ సినిమా కోసం విరామం లేకుండా పని చేస్తూనే రామ్ కోసం తీరిక చేసుకుని ఈ వేడుకకు హాజరయ్యాడు పవన్. 

మెగా హీరోల సినిమాల వేడుకలకు దూరంగా ఉండే పవన్ తనకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసే వ్యక్తి సెలూన్ ప్రారంభోత్సవానికి అతిధిగా వచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు. అంతేకాదు పవన్ రాకతో ఈ సెలూన్ ప్రారంభోత్సవం న్యూస్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో మీడియాలో లక్షలు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ పవన్ రాకతో వచ్చింది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: