కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్రెస్ గా మారిన వ‌ర్మ సోష‌ల్ మీడియా ద్వారా ఎప్పుడు వార్త‌ల‌లో నిల‌వాల‌ని భావిస్తుంటాడు. అందుకే స‌మాజంలో జ‌రిగిన ప్ర‌తి విష‌యంపై త‌న దైన స్టైల్ లో కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా డ్ర‌గ్స్ కుంభ‌కోణంకి సంబంధించి ఫేస్ బుక్ లో వ‌ర్మ కొన్ని వ్యాఖ్య‌లు చేశాడు.  ప్ర‌తి మ‌నిషికి నోరు ఉంటుందని, ఎవ‌రి అభిప్రాయాలు వారు చెబుతారని తాను కూడా త‌న అభిప్రాయాల‌ను చెబుతూ ఉంటాన‌ని అన్నారు. ఒక‌వేళ త‌న‌కు నోటీసులు వ‌చ్చినా తాను వెళ్లి అధికారుల ముందు కూర్చోవాల్సిందేన‌ని, త‌న‌కు కూడా నోటీసులు రావచ్చని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. 



తాను చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ఎక్సైజ్ శాఖ అధికారులు ఆత్మ‌స్థైర్యం కోల్పోతున్నామ‌ని మాట్లాడుతున్నార‌ని, ఒకే ఒక్క వ్య‌క్తి త‌న అభిప్రాయం చెప్పినంత మాత్రాన అంత‌పెద్ద పోలీస్ వ్య‌వ‌స్థ ఆత్మ‌స్థైర్యం కోల్పోతుందా? అని ప్ర‌శ్నించారు. సినిమావాళ్లు త‌ప్పా ఎవ్వ‌రూ డ్ర‌గ్స్ తీసుకోర‌న్నట్లు చూపిస్తున్నారని అన్నారు. మ‌త్తులో మునిగిపోయిన సినిమా ప్ర‌పంచం అని చూపిస్తున్నారని మండిప‌డ్డారు. విచార‌ణ ముగిసిన అనంత‌రం దాన్ని ఎదుర్కున్న వారు నిజంగానే డ్ర‌గ్స్ తీసుకున్నారా? అనే అంశం బ‌య‌ట‌ప‌డుతోందని అన్నారు. 



సినీ ప్రముఖులకు మాత్రమే నోటీసులు ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, డ్రగ్స్ దందాలో పేరున్న రాజకీయ నేతలు, వీఐపీలు లేదా మరెవరైనా, అన్ని వర్గాలనూ కలిపి నోటీసులు ఇచ్చి విచారించి వుంటే, ఈ తరహా విమర్శలు వచ్చుండేవి కాదని అభిప్రాయపడ్డాడు. ఎక్సైజ్‌శాఖ ఎప్పటి నుంచో ఉందని, సినిమా వాళ్ల పేర్లు బయటపెట్టడం వల్లే ఆ శాఖ పేరు మొదటిసారి మార్మోగిపోతోందని, తమ పనితనాన్ని ప్రజలకు తెలియజేసేందుకు సినీ రంగాన్ని టీజర్, ట్రైలర్‌లా ఎక్సైజ్‌శాఖ వాడుకుందని వర్మ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: