రామ్ చరణ్ టాప్ యంగ్ హీరోల రేస్ లో తన స్థానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే మరొక వైపు టాప్ ప్రొడ్యూసర్ గా మారడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’ ఇచ్చిన జోష్ తో చరణ్ ఈసారి ‘బాహుబలి’ రికార్డులను టార్గెట్ చేసే విధంగా అత్యంత భారీ బడ్జెట్ తో ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ ని తీస్తున్న విషయం తెలిసిందే. 

అయితే ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోయినా ఈసినిమా విషయంలో వస్తున్న గాసిప్పులు లీకుల విషయంలో చరణ్ తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన నటీనటుల క్యారెక్టర్ డిటైల్స్ తో పాటు నెమ్మదిగా ఈసినిమా కథకు సంబంధించిన లీకులు బయటకు రావడం చరణ్ కు ఏమాత్రం రుచించడంలేదు అని టాక్. 

కేవలం రాయలసీమ వాసులకే పరిచయం ఉన్న ‘ఉయ్యాలవాడ’ కథ పూర్తిగా ఓపెన్ అవ్వడం చరణ్ కు నచ్చడం లేదు అని అంటున్నారు. ఈసినిమా స్క్రిప్ట్ గురించి పరుచూరి బ్రదర్స్ తో పాటు చాలామంది రచయితలు సహకరిస్తున్న నేపధ్యంలో రైటర్స్ సర్కిల్ నుండి ఈసినిమాకు సంబంధించిన లీకులు వస్తున్నాయని చరణ్ గుర్తించినట్లు టాక్.

ఇది ఇలా ఉండగా ఈసినిమా ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా పూర్తికాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కథ కావడంతో పాటు ‘ఉయ్యాలవాడ’ చరిత్రకు సంబంధించిన చారిత్రక ఆధారాలు లభించడంలో కొంత ఆలస్యం అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నవంబర్ ప్రాంతానికి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.. 

అయితే టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన సినిమాల వార్తల పై లీకులు రావడం సర్వసాధారణంగా మారిన నేపధ్యంలో చరణ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ‘ఉయ్యాలవాడ’ పై వస్తున్న లీకులు చరణ్ ఆపగలడా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: