హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడు లేడని మనకు ఎప్పటి నుంచో తెలిసిన విషయం. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము. మన దృష్టిలో శక్తి అంటే ఒక పదం మాత్రమే కాదు అది చలనానికి ప్రతీక. ఆ శక్తిని భిన్నరూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు.

విశ్వంలోని స్త్రీ తత్వాన్ని ఆరాధించేందుకు నవరాత్రులు ఓ గొప్ప సందర్భం. ఆ స్త్రీ మనకు మాతృమూర్తిగా ఆయురారోగ్యాలను ప్రసాదించే తల్లిగా జ్ఞానాన్ని అందించే తొలిగురువుగా ఈ తొమ్మిది రోజులు దేశ వ్యాప్తంగా దుర్గాదేవిని ఆరాదిస్తారు. సృష్టిలోని స్త్రీలంతా శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది. 

లక్ష్యం కోసం ఎంత గొప్పగా పోరాడి విజయం సాధిస్తేనే సార్ధకత ఏర్పడుతుంది. ఆ సార్ధకతను మన  జీవితానికి అన్వయిస్తూ ఈ తొమ్మిది రోజులు జరిగే అమ్మవారి పూజలలో దుర్గా దేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. పౌర్ణమితో కూడిన అశ్వినీ నక్షత్రం గల మాసం ఆశ్వయుజ మాసం. ఇదే శరదృతువుకు లేదా చలికాలానికి ప్రారంభం. ఈ మాసంలో శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు గల నవ రాత్రులను శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులుగా  పూజలు చేస్తారు. 

దుర్గాదేవిని మహేశ్వరి శక్తిగానూ, పరాశక్తి గాను, జగన్మాత శక్తిగానూ పలు రూపాల్లోఈ తొమ్మిది రోజులలో  ఉపాసిస్తూ ఉంటారు. ఈరోజు ఆశ్వయుజ పాడ్యమినాడు శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవిగా ఈరోజు అమ్మ మనకు దర్శనం ఇస్తుంది. ఈ మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాలా త్రిపుర సుందరి అని కూడ అంటారుఈరోజు అమ్మవారిని ఆరాధించిన వారికి సర్వ మనో వికారాలు తొలిగిపోయి నిత్య సంతోషం కలుగుతుందని మన నమ్మకం..


మరింత సమాచారం తెలుసుకోండి: