‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తన జనసేన ట్విటర్ లో ఇచ్చిన లేటెస్ట్ స్లోగన్ ఇప్పుడు పవన్ అభిమానులకే కాకుండా అందరికీ హాట్ టాపిక్ గా మారడంతో ఈ స్లోగన్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ‘అడుగు ముందుకు వేస్తే తల తెగి పడాలే గానీ కాళ్ళు అయితే వెనక్కి పడదు’ అన్న ఈ స్లోగన్ అందర్నీ విపరీతంగా ఆశ్చర్య పరుస్తోంది. 

సినిమా డైలాగ్ లా ఉన్న ఈ స్లోగన్ ‘జనసేన’ కొత్త నినాదమా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికితోడు రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ సైన్యానికి పవన్ ఇదే స్లోగన్ తో పిలుపు ఇవ్వబోతున్నాడా ? అన్న ప్రచారం కూడ జరుగుతోంది. ‘జనసేన’ పార్టీ కోసం సర్వ శక్తులూ ఒడ్డాలన్న లక్ష్యంతో పవన్ ఈ పిలుపు ఇస్తున్నాడా ?  అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈ ట్విట్ లో వాడిన పదాల పై కొన్ని చర్చలు కూడ జరుగుతున్నాయి. ఈ ట్విట్ లో కాళ్ళు అయితే వెనక్కి పడదు అన్న క్యాప్షన్ ఉంది. కాళ్ళు బహువచనమైనప్పుడు ‘వెనక్కి పడవు’ అని ఉండాలి కానీ ‘వెనక్కి  పడదు’ అని కావాలనే ట్విట్ చేసారా దీనికి వెనుక కూడ ఏదైనా ఆంతర్యం ఉందా ? అన్న కోణంలో కూడ చర్చలు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఏమి లేకపోయినా రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికల కోసం తమ పార్టీ కేడర్ ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ‘జనసేన’ పార్టీ కూడ తనకు సొంతంగా ఒక టీమ్‌ ని తయారుచేసుకునే పనిలో ఇలాంటి ట్విట్ ను పవన్ చేసాడా అన్న ఆలోచనలు కూడ వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ 4915 మందితో జాబితాతో ‘జనసేన’ కు సంబంధించిన విశ్లేషకులు కంటెంట్ రైటర్స్ స్పీకర్లకు సంబంధించిన లిస్టును రిలీజ్ చేసాడు. ఈ లిస్టులో ఉన్న వారు నిన్నటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు వద్దనున్న సీతారామ భారతీయ మండపం వద్ద శిక్షణ పొందుతున్నారు. దీనితో పవన్ సైన్యం ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: