ఈసారి దసరా పండగ విజేత ఎవరో స్పష్టంగా తేలిపోయింది. తెలుగు సినిమా ప్రేక్షకులు “మహానుభావుడు” సినిమానే ఈఏడాది దసరా విజేతగా నిర్ణయించారు.  సందర్భోచితమైన హాస్యంతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ‘దసరా విన్నర్’ గా నిలుస్తుందని బహుశా ఈ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు.  కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నిన్నవిడుదల అయిన ‘మహానుభావుడు’ మొదటి రోజు మొదటి షో నుండి  పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

ఒక విధంగా  “మహానుభావుడు” సినిమాని గెలిపించిన ఘనత ‘జై లవ కుశ’ మరియు ‘స్పైడర్’ చిత్రాలకే చెందుతుంది. ఇద్దరు టాప్ హీరోలు సాధించలేని విజయాన్ని శర్వానంద్ ఎలా అందుకున్నాడు అనే విశ్లేషణలోకి వెళ్ళితే ప్రేక్షకులు ప్రస్తుతం కొత్తదనానికే ఓటు వేస్తున్నారని మరో సారి ‘మహానుభావుడు’ సినిమా ద్వారా  నిరూపింపబడింది.  సగటు ప్రేక్షకుడికి కావల్సినంత వినోదాన్ని పండించడంతో మహానుబావుడి విజయం సాధించింది. దీనితో ‘మహానుభావుడు’ విజయం అగ్రహీరోలకు గుణపాఠంలా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రొటీన్ మూస కధలను ఎంపిక చేసుకుని కోట్లకు కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టాలనే టాప్ హీరోల ప్రయత్నాలకు తెలుగు ప్రేక్షకులు తమ తీవ్ర వ్యతిరేకత తెలియచేసారు. మన టాప్ హీరోలు క్రేజీ కాంభినేషన్లను సెట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారే తప్ప ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కధలను ఎంపిక చేసుకోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నారని ఈ దసరా రేస్ తెలియ చేసింది. గత కొంత కాలంగా అగ్ర హీరోలు నటించిన సినిమాల కంటే  చిన్న హీరోలు  బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా జయకేతనం ఎగురవేయడం ఒకవిధంగా టాప్ హీరోలు జీర్ణించుకోలేని వాస్తవంగా మారింది.

దీనికితోడు మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అభిప్రాయాలనే ఇంచుమించు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడ తెలియజేయడంతో ఓవర్సీస్ లో కూడ టాప్ హీరోల హవా మసగ బారుతోంది. ‘జై లవ కుశ’ యూఎస్ మార్కెట్ హక్కులను 8.5 కోట్లకు కొనుగోలు చేయగా బ్రేక్ ఈవెన్ రావాలంటే 1.8 మిలియన్ డాలర్స్ రావాలి. కానీ ప్రస్తుతానికి ఈ సినిమాకు 1.4 మిలియన్ డాలర్స్ మాత్రమే రావడంతో ఈ సినిమాను కొనుకున్న ఓవర్సీస్ బయ్యర్ కు నష్టాలు తప్పవు అన్న ప్రచారం జరుగుతోంది.

“స్పైడర్” విషయానికి వస్తే 15.5 కోట్లకు ఈ మూవీని ఓవర్సీస్ బయ్యర్ కొనుగోలు చేయగా  బ్రేక్ ఈవెన్ దశకు రావాలంటే 4 మిలియన్స్ కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘స్పైడర్’ కు వచ్చిన టాక్ తో ఈ సినిమా ఓవర్సీస్ బయ్యర్లకు కూడ భారీ నష్టాలు తప్పవు అని అంటున్నారు.  అయితే “మహానుభావుడు”  సినిమాను కేవలంను 3.25 కోట్లకు కొనుగోలు చేసిన ఓవర్సీస్ బయ్యరకు మంచి లాభాలు రావడం ఖాయం అవడంతో ఈ మూడింటిలోకల్లా లాభదాయకమైన ప్రాజెక్ట్ గా ‘మహానుభావుడు’  మారిపోయింది. ఏది ఏమైనా ఈ దసరా మన  టాప్ హీరోలు అందరికీ మరిచిపోలేని గుణపాఠం నేర్పింది అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: