ఒకనాడు ఆ దర్శకుణ్ణి కలవాలి అంటే నిర్మాతలు ఆయన ఇంటిముందు పడిగాపులు కాసేవారు. ఆయన సినిమా తీస్తే చాలు ఆయన ఎంత పారితోషికం అడిగితే అంత ఇస్తాము అంటూ క్కూ కట్టేవారు. కాని అదే వ్యక్తి చివరిరోజుల్లో ఎవరికైనా కనిపిస్తే చాలు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయే వారు. ఆయన ఎవరో కాదు తెలుగు సినిమా కు వైభవాన్ని తెచ్చిపెట్టిన గొప్ప దర్శకులలో ముందువరసలో ఉండే కె.వి.రెడ్డి.

‘పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరుని కధ’ ఈ సినిమాల పేర్లు వినగానే కెవి.రెడ్డి గుర్తుకు వస్తారు. ఈ సినిమాలు ఎన్ని వందల సార్లు చూసినా మళ్ళి చూస్తున్నప్పుడు చూసే ప్రేక్షకుడుకు విసుగు అనిపించదు. అదే కెవి.రెడ్డి మేజిక్. ఆయన ఒక సినిమా పాఠ్యగ్రంధం. ఆయనకు సినిమా తప్పించి మరే విషయం తెలియదు. ఆయనకు స్నేహితులు అంటూ పెద్దగా ఎవరూ లేరు. ఆయన సినిమాకు పబ్లిసిటీ చేయడం అంటే ఆయనకు ఎంతో కోపం వచ్చేదట. ప్రేక్షకులకు నచ్చాలికాని పబ్లిసిటీ ఎందుకు అంటూ ప్రశ్నించేవారు ఆయన. తన నిర్మాతలకు కోట్లాది రూపాయలు ఆరోజుల్లోనే సంపాదించిపెట్టి ఇచ్చిన ఈయన తన చివరి రోజులలో కేవలం కొన్ని వేల రూపాయల కోసం ఇబ్భందిపడే వారు అంటే ఎవరు నమ్మరు. ఆయన చివరి రోజుల్లో ఆయన ఆఫీస్ రూమ్ కు ఉన్న నేమ్ ప్లేట్ ను, ఆయన ఉపయోగించే కారు ను ఆయనకు తెలియకుండానే ఆయనకు అప్పులు ఇచ్చినవారు తీసుకువెళ్ళిపోతే, ఆయన ఎంతో మానసిక క్షోభ అనుభవించారట.

అటువంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కెవి.రెడ్డి, తన చివరి దశలో తన కొడుకును పై చదువుల కోసం అమెరికా పంపించడానికి డబ్బు అవసరం అయి ఎవరినీ అడగలేక మహా నటుడు ఎన్.టీ.రామారావు దగ్గరకు వెళ్లి, తనకు డబ్బు అవసరమని అందువల్ల ఏదైనా సినిమాకు స్క్రీన్ ప్లే రాసే అవకాశం కల్పించమని రామారావు ను కెవి.రెడ్డి అడిగితే, ఎన్టీఅర్ ఆయన పరిస్థితికి చలించిపోయి స్క్రీన్ ప్లే కాదు, మీరే ఒక సినిమాకు దర్శకత్వం వహించండి అంటూ కెవి.రెడ్డి ని ‘శ్రీకృష్ణ సత్య’ సినిమాను తియ్యమని ప్రోత్సహించడమే కాకుండా ఆయనకు అవసరమైన ఆర్ధిక సహాయం రామారావు చేశారట. ‘నాతో సినిమా తీస్తే మీరు నష్టపోతారు’  అని కెవి.రెడ్డి చెపుతున్నా, వినకుండా మన విశ్వవిఖ్యాత నట సార్వభోమ కెవి.రెడ్డి చేత ‘శ్రీకృష్ణ సత్య’ పట్టు పట్టి తీయి౦చారట. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి మహానటులకు కోట్లు సంపాదించిపెట్టిన కెవి.రెడ్డి, చివరి రోజులు ఇలా గడవడం తెలుగు సినిమా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అని అంటారు. వందేళ్ళ పండుగను జరుగుకుంటున్న సినిమా చరిత్రలో కెవి.రెడ్డి కీర్తి ఎప్పుడూ శాశ్వతమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: