మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం ఆమె తండ్రి కృష్ణారాజ్‌ రాయ్‌ జయంతి పురస్కరించుకుని ముంబయిలోని స్మైల్‌ ట్రైన్ ఫౌండేషన్‌ ద్వారా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించనున్నట్లు ప్రకటించారు. 

ఈ సమయంలో  కొందరు ఫోటోగ్రాఫర్‌లు చేసిన పనికి ఆమె మనస్థాపం చెంది స్టేజీపైనే కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆమె.. ‘‘ప్లీజ్ నాకు ఫొటోలు తీయకండి. ఇది సినిమా ప్రిమియర్ షో కాదు. పబ్లిక్ ఈవెంట్ కూడా కాదు. మీరెందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. దీని విలువ ఏంటో మీకు అర్థం కావడం లేదని భావోద్వేగానికి గురయ్యారు.  ఇక ఆ ఫోటోగ్రాఫర్లు ఆ మూమెంట్‌ను కూడా క్లిక్‌ మనిపించటం విశేషం. ఐశ్వర్య రాయ్ తండ్రి కృష్ణారాజ్‌ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు.

కృష్ణారాజ్‌ కూడా గ్రహణం మొర్రితోనే జన్మించారు. 2011లో ఆయన గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న దాదాపు 100 మంది చిన్నారులకు చికిత్స చేయించినట్లు ఐశ్వర్య ఈ సందర్భంగా తెలిపారు.ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యతో కలిసి అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి, తన తండ్రి జయంతి వేడుకలు నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: