మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అనగానే కంగారుపడిపోతారు హీరోయిన్లు. నాకంత టైమ్ లేదు, నా దృష్టంతా కెరీర్ మీదే అని ఠక్కున చెప్పేస్తారు. పోనీ ఇంతకు ముందెప్పుడైనా ప్రేమించారా అంటే అస్సలు లేదు అని తడుముకోకుండా చెబుతారు. కానీ నిత్య తీరే వేరు. తన ప్రేమ గురించి చాలా ఓపెన్ గా చెప్పేసింది. అలా మొదలైంది సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరయ్యింది నిత్య. ఇక ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే సినిమా తరువాత మనమ్మాయే అన్నంతగా కలిసిపోయింది. చేసే సినిమాలు తక్కువే అయినా, అన్నీ గుర్తుండిపోయే సినిమాలు చేస్తుందామె. అందుకే తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. నిత్య ఎప్పుడూ చాలా ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటుంది. నచ్చినదాన్ని ఎంత ఫాస్టుగా చెబుతుందో, నచ్చనిదాన్ని అంతే సూటిగా చెప్పేస్తుంది. ఇప్పుడు తన ప్రేమకథ గురించి కూడా అంతే నిర్మొహమాటంగా చెప్పేసింది నిత్య.  తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని గతాన్ని పరిచింది. నిత్య మహా హుషారైనదట. దాంతో చదువుకునే రోజుల్లో ఆమెకు ప్రపోజల్స్ చాలా వచ్చేవట. పద్దెనిమిదేళ్ల వయసులో ఓ అబ్బాయి బాగా నచ్చాడట. దాంతో అతడితో ప్రేమలో పడిందట. అయితే నాలుగేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారట. అతడు తనకు తగినవాడు కాదని, ఇద్దరి అభిప్రాయాలు వేరని, కలసి ఉండటం కష్టమని అనిపించగానే బ్రేకప్ అయ్యారట. మొదట్లో చాలా బాధగా అనిపించేదట కానీ, సరిగ్గా అప్పుడే అలా మొదలైంది ఆఫర్ రావడంతో పనిలో పడి తేరుకుందట. అది నిత్య ప్రేమకథ. ఏదేమైనా దాపరికం లేకుండా ఇలా నిజాన్ని చెప్పినందుకు నిత్యను మెచ్చుకుని తీరాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: