సూర్యోదయం కాకుండానే ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల తెలుగు హృదయాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. ఈ వార్త నిజమేనా అని బాధ నుంచి తేరుకోలేక పోతున్నాయి పది కోట్ల తెలుగు హృదయాలు. ఏడు దశాబ్దాల పాటు తన నటనతో రంజిపంజేసి ప్రేక్షకుల్ని మైమరిపించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మన మధ్య నుండి అక్కినేని నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచి సుదూర తీరాలకు వెళ్ళిపోయారు.  తెలుగువారు ఆయనను మరిచిపోవడం అంత తేలికైన విషయంకాదు. మనిషి అనేవాడు ఎలా బతకాలో ఎలా బతక్కూడదో ఆయన పాత్రలు చెప్పాయి. సంఘాన్ని సంస్కరించేంత గొప్ప పాత్రలు పోషించిన ఘనత ఆయనది. ఈ వయసులో కూడా మూడు తరాలకు చెందిన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’. అక్కినేని అంటే మనకు గుర్తుకు వచ్చేవి ఎన్నో ప్రేమ సినిమాలు, మరెన్నో కుటుంబ కధా చిత్రాలు వీటిని మించి మరెన్నో ఆధ్యాత్మిక పౌరాణిక పాత్రలు. తెలుగుతెరపై అజరామరమైన సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలతో రంజింపజేసి ‘నటసామ్రాట్’ బిరుదుని సార్థకం చేసుకున్నారాయన. కార్యదీక్షకు మారుపేరుగా అక్కినేనిని పిలుస్తారు. 82 ఏళ్ల తెలుగు సినిమాతో, 72ఏళ్ల పాటు ప్రయాణించి తెలుగులోనే కాదు తమిళంతో కూడా కలుపుకుని 256 సినిమాలు నటించిన పద్మవిభూషణుడు అక్కినేని. అక్కినేని ఈ స్థాయికి రావడానికి ఆయన జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు, ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సుడిగుండాలు ఎదుర్కున్నారు. అక్కినేని కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురంలో 1924 సెప్టెంబర్ 20న పున్నమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు.  నిజానికి అక్కినేని కుటుంబంలో కళాకారులు లేరు. అయినా తన చిన్నతనం నుండే నాటకల్లో వేషాలు వేసేవారాయన. అక్కినేని ధరించిన తొలి పాత్ర ‘నారదుడు’. వెంకటరాఘవపురంలో పిల్లలందరూ కలిసి వేసిన ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో పట్టుబట్టి అక్కినేనితో నారద పాత్రను వేయించారు. కారణం ఆ ఊళ్లో ఆయన మంచి పాటగాడు కావడమే. ఆ తర్వాత ఏఎన్నార్ నటించిన పాత్ర ‘చంద్రమంతి’ రంగస్థల కళాకారునిగా అక్కినేని తొలి పారితోషికం అర్థరూపాయి అక్కడ నుంచి ఆరోజులలోనే లక్షల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు అక్కినేని. అమ్మ, అన్న ప్రోత్సాహం వల్లే రంగస్థలంపై రాణించగలిగానని చెబుతూ ఉండేవారు అక్కినేని. అటువంటి అక్కినేని తెలుగు సినిమా రంగానికి నటసామ్రాట్ గా మారి దాదాపు ఏడు దశాబ్ధాలు తెలుగు సినిమాను ఏలిన అక్కినేని ఈరోజు మన మధ్య నుండి దూరమైనా తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఎప్పుడు చిరస్మరనీయుడే.  

మరింత సమాచారం తెలుసుకోండి: