దర్శకుడు భారతిరాజా పేరును ఎరుగని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండడు. ఆయన సినిమాలు టాలీవుడ్ లో కూడ చాల ఘనవిజయం సాధించాయి. అటువంటి భారతిరాజా తెలుగు వారికి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. తమిళ హాస్య నటుడు వడివేలు హీరోగా వస్తున్న 'తెనాలిరామన్‌' విడుదలను వ్యతిరేకిస్తున్నతెలుగు వారు తమ తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తమిళ సీనియర్‌ దర్శకుడు భారతిరాజా హెచ్చరించారు.  వడివేలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'తెనాలిరామన్‌'పై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కొంత కాలంగా తమిళ సినీ పరిశ్రమను, తమిళ సినీ కళాకారులను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తెనాలిరామన్‌ వివాదం కూడా అందులో భాగంగానే తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్నటి విశ్వరూపం నుంచి నేటి తెనాలిరామన్‌ వరకు సెన్సార్‌ పూర్తెన చిత్రాలకు సైతం వ్యతిరేకత తెలపటం చూస్తుంటే కొందరికి తమిళ భాష పైనా, సినీ పరిశ్రమ, కళాకారులపైన ఏదో దురుద్ధేశం ఉన్నట్లు కనిపిస్తోంది అంటు తెలుగు వారిని టార్గెట్ చేస్తూ విడుదల చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అంతేకాదు ప్రపంచ ప్రసిద్ధి చెందినవారినే అపహాస్యం చేస్తూ కార్టూన్లు గీసినవారున్నారని, అది వారికున్న స్వేచ్ఛ అని అంటు తెలుగు మాట్లాడిన తెనాలిరామన్‌ కథలో అక్కడక్కడా తెలుగు సంభాషణలు రావటం సహజమని, దాన్ని పరిగణలోకి తీసుకుని విడుదలకు ముందే తమకు చిత్రాన్ని చూపించాలనటం, కోర్టుకు వెళ్లటం ఎంతవరకు సమంజసం అంటు ఘాటుగా ప్రతిస్పందించాడు భారతిరాజా. ఇది ఇలా ఉండగా ఈరోజు మంగళవారం ఈ సినిమాకు వ్యతిరేకంగా ఒక శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెన్నైలోని తెలుగు సంఘాల ప్రతినిధులు తెలియచేసారు. ఎందరో తమిళ హీరోలను, దర్శకులను మన నెత్తిమీద పెట్టుకుని పూజిస్తున్న తెలుగు వారి పై భారతిరాజ చేసిన వ్యాఖ్యల పై కనీసం మన తెలుగు సినిమా కళాకారులు ఎంత వరకు పట్టించుకుంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: