ఏడు దశాబ్ధాలుగా భారతీయ సినిమా, నాటక రంగానికి ఎనలేని సేవ చేసిన ప్రముఖ బాలీవుడ్‌ నటి జోహ్రా సెహగల్‌ గుండెపోటుతో చనిపోయారు. భారతీయ సినిమా, నాటక రంగానికి సుదీర్ఘకాలంగా సేవలందించిన ప్రముఖ బాలీవుడ్ నటి జోహ్రా సెహ్‌గల్ వయస్సు 102 సంవతర్సాలు. గురువారం గుండెపోటు రావడంతో ఢిల్లీలోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరంచారు. అక్కడే ఆమె సాయంత్రం నాలుగున్నర గంటలకు తుదిశ్వాస విడిచారు. నాలుగురోజులుగా జోహ్రా అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు కూతురు కిరణ్‌ తెలిపారు. ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హాబీబ్‌ ట్విట్‌ చేయడంతో జోహ్రా మరణవార్త ప్రపంచానికి తెలిసింది.1912లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ముస్లిం కుటుంబంలో జన్మించిన జోహ్రా సెహ్‌గల్‌1935లో ఉదయ్‌శంకర్‌తో కలిసి నాటకరంగంలో నర్తకిగా జీవితప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ దేశాల్లో నర్తకిగా ఎన్నో ప్రదర్శనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1942లో ప్రముఖ చిత్రకారుడు, శాస్త్రవేత్త కామేశ్వర్‌ సెహ్‌గల్‌ని వివాహం చేసుకున్న ఆమె1946లో "దర్తీకే లాల్‌' చిత్రం ద్వారా నటిగా సినీరంగం ప్రవేశంచేశారు. సుమారు ఏడు దశాబ్దాలపాటు వివిధ పాత్రలు పోషించిన అందరిని మెప్పించిన జోహ్రా.. భారతీయ సినిమా రంగంలో తనదైన ముద్రవేశారు. పలు ఆంగ్ల చిత్రాల్లో నటించిన జోహ్రా సెహ్‌గల్ ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. చినీకం, దిల్‌సే, వీర్‌జారా, హమ్ దిల్‌ దే చుకే సనమ్‌, కబీకుషీ కభీఘమ్‌ వంటి ఎన్నో అపురూప చిత్రాల్లో నటనకుగాను అందరి ప్రశంసలు అందుకున్నారు. చివరిసారిగా 2007 లో సావరియా చిత్రంలో నటించారు.జోహ్రా మృతిపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్రసంతాపం తెలిపారు. తన నటనతో అన్నివర్గాల వారిని ఆకట్టుకున్నారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. తన ప్రతిభతో సినిమా, నాటక రంగాలని ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆమె మరణవార్త ఎంతో కలచివేసిందని వ్యాఖ్యానించారు. జోహ్రా మృతిపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. జోహ్రా మృతి తీరనిలోటు అని వ్యాఖ్యానించిన అమితాబ్‌....ఆమె ఆత్మకు శాంతి కలగాలని ట్విట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: