ఈమధ్యనే రిలీజ్ అయిన సందీప్ కిషన్ ‘రారా కృష్ణయ్య’ ఎవరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మంచి ఫలితాన్నే ఇచ్చింది. సందీప్ కిషన్ ఇప్పటివరకు నటించిన సినిమాలలో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా కృష్ణయ్య నిలబడటంతో అటు నిర్మాతలు ఇటు సందీప్ కిషన్ హ్యాపీగా ఉన్నారు. అయితే వీరి ఆనందం పై నీళ్ళు జల్లుతూ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టిప్స్ ‘రారా కృష్ణయ్య’ మూవీ తమ సినిమా ‘తేరే నాల్ లవ్ హోగయా’ కు కాపీ అంటూ ‘రారా కృష్ణయ్య’ సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. రితేష్‌దేశ్‌ముఖ్, జెనీలియా‌లు నటించిన ఈ సినిమా 2012 లో విడుదల అయింది. ఈ సినిమాలోని పాత్రలను, కధను కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ‘రారా క్రిష్నయ్య’ నిర్మించారని బాలీవుడ్ నిర్మాణ సంస్థ టిప్స్ వాదన. తమ నోటీస్ కు ప్రతిస్పందన సరిగ్గా లేకపోతే ‘రారా కృష్ణయ్య సినిమా ప్రదర్శన ఆపుచేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో సారాంశం అని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఈ సినిమా నిర్మాత వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ‘రారా కృష్ణయ్య’ సినిమా ఏ బాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టి తియ్యలేదని అని అంటున్నారు. గతంలో ‘’జబర్దస్త్’’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ సినిమాలకు సంబంధించి కూడ ఇటువంటి వార్తలే వచ్చినప్పుడు ఆ బాలీవుడ్ సినిమాల నిర్మాతలతో రాజీ చేసుకున్నారు. మరి ‘రారా కృష్ణయ్య’ నిర్మాతలు ఏమి చేస్తారో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: