నాక్కుంచెం తిక్కుంది..అయితే దానికో లెక్కుంది..అంటాడు పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో. ఆ డైలాగ్ సినిమాలోనే కాదు ఆయన నిజ జీవితానికి కూడా వర్తిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. టాలీవుడ్‌లో పవర్ స్టార్‌గా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవన్. ఆయనకున్న డిమాండుకు ఒకేసారి పది సినిమాలు కూడా ఒప్పేసుకోవచ్చు. అయితే, తన గుండెను స్పృశించే కథలను మాత్రమే పవన్ ఒప్పుకుంటారన్న పేరు ఉండడంతో ఆయన చిత్రాలు ఏడాదికి ఒకటి మించి రావడం గగనమైపోతోంది. అయినా ఆయన అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడి చిత్రం విడుదల కోసం ఆశతో ఎదురుచూస్తూనే ఉంటారు. ఈ ఏడాది జన సేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి కూడా ప్రవేశించిన పవన్ ఇక్కడ కూడా తన సినీ శైలినే పాటిస్తున్నట్లు కనపడుతోంది. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యపైన స్పందించకుండా తన హృదయాన్ని తాకిన సంఘటనలప్పుడు మాత్రమే స్పందిస్తూ రాజకీయాలలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు పవన్. ఉదాహరణకు, ఇటీవల మెదక్ జిల్లాలో స్కూలు బస్సు రైలును ఢీకొన్ని సంఘటన గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన ప్రమాద స్థలానికి వెళ్లి ప్రమాదంలో మరణించిన పిల్లల కుటుంబాలను పరామర్శించారు పవన్. అదే విధంగా స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి రెండు ముఖ్యమైన సందర్భాలలోనే ఆయన ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. శుక్రవారం భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఒక సందేశం పంపారు పవన్. ఏదేమైనా..పవన్ తీరే వేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: