ఈరోజు మెగా స్టార్ అభిమానులకు పండుగ. ‘పునాది రాళ్ళు’ సినిమాతో టాలీవుడ్ లో పునాది వేసుకున్న ఒక సామాన్య వ్యక్తి ‘మెగాస్టార్’ గా ఎదిగి మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ ను మకుటంలేని మహారాజుగా ఏలిన చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆ శక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. తాను సినిమాలలో స్టెప్స్ వేసే విషయంలో ఒక కొత్త ఒరవడి సృష్టించాననీ చాలామంది పోగుడుతారని అయితే ఆ పొగడ్తలు తనకు చెందవని తన దగ్గర తన సినీ కెరియర్ తొలినాళ్ళలో పనిచేసిన తన మేనేజర్ వెంకన్నబాబుకు ఈ క్రెడిట్ చెందుతుందని ఎవరికీ ఇప్పటి వరకు తెలియని ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాడు చిరంజీవి. తన కెరియర్ తొలి నాళ్ళలో తన సినిమాలలోని పాటలకు తాను చేస్తున్న డాన్స్ చూసి తన మేనేజర్ వెంకన్న బాబు తను అడగ కుండానే స్పందిస్తూ ‘నీ ప్రత్యేకత చూపెట్టకుండా నీవు చేస్తున్న డాన్స్ ఇలాగే చేసుకుంటూ పోతే నీవు నిలబడలేవు’ అన్న వెంకన్న బాబు కామెంట్స్ తనలో కసిని పెంచి చిరంజీవిని మెగా డాన్సర్ గా మార్చాయని వాస్తవాలు బయట పెట్టాడు చిరంజీవి. తనకు సినిమా రంగం ఎప్పటికీ పుట్టిల్లు అన్న చిరంజీవి తన అత్త ఇల్లు రాజకీయ రంగం నుండి తిరిగి సినిమాల వైపు ఎందుకు చూస్తున్నాడో వివరించాడు. బాలీవుడ్ టాప్ హీరో అమితాబ్, సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ మన్మధుడు నాగార్జునలతో పాటు తన మిత్రుడు మోహన్ బాబులు తరుచు తనను తన 150వ సినిమా పూర్తి చేయమని బలవంతం చేయడంతో కోట్లాది తన అభిమానుల కోరికను కూడ దృష్టిలో పెట్టుకుని తన 150వ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఈరోజు ఇరు రాష్ట్రాలలోను తన అభిమానులు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతూ ఉండటం తన అభిమానులకు సమాజం పట్ల ఉండే బాధ్యతను గుర్తుకు చేస్తోంది అని అంటూ, అటువంటి అభిమానులను పొందడం తన అదృష్టం అన్నాడు మెగాస్టార్. తన పుట్టినరోజునాడు అభిమానులకు అందుబాటులో లేకుండా నేపాల్ లో ఉన్న తన లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలను అభిమానులకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడు చిరంజీవి. ఈ ఫోటో షూట్ లో మళ్ళీ హీరో లుక్ తో కనిపిస్తూ చిరంజీవి తన వయసును పది సంవత్సరాలు వెనక్కి తీసుకు వెళ్ళిపోయాడు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో తన తమ్ముడు పవన్ గురించి మాట్లాడుతూ తనకు తన తమ్ముడి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి అంటూ మీడియా రాస్తున్న కధనాలు తనకు నవ్వు పుట్టిస్తాయని అన్నాడు ఈ మెగాస్టార్. అంతేకాదు పవన్ తన కొడుకు లాంటి వాడని, ఒకొక్కసారి ఆలోచిస్తే తనకు చరణ్ కన్నా పవన్ దగ్గర అనిపిస్తాడని చెప్పుకు వచ్చాడు చిరంజీవి. రాజకీయ మార్గాలు వేరైనా చివరకు తమ సామాజిక లక్ష్యం ఒకటే అంటూ తన పుట్టినరోజునాడు మెగా అభిమానులు అంతా ఒకటే అనే సంకేతాలు ఇచ్చాడు చిరంజీవి. రాజకీయ రంగంలో చిరంజీవి ప్రస్థానం ఎలా ఉన్నా తెలుగు సినిమా రంగంలో మాత్రం ఆనాటి అక్కినేని, నందమూరి తరువాత తెలుగు సినిమా రంగాన్ని శాసించిన ఏకైక రియల్ మెగాస్టార్ చిరంజీవికి ఎపి హెరాల్డ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: