బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం లో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం. ఈయన హిందీ, తెలుగు,తమిళ,మళియాల భాషలలో దాదాపు 51 సినిమాలు రూపొందించారు. కార్టునిస్టుగా బాపు పేరు ఇతర దేశాలలో కూడా మార్మోగింది అంటే అతిశయోక్తి లేదు. బాపు రామాలయంలో పూజారుగా ఉండాల్సినవారని మహాకవి శ్రీశ్రీ మాటలు అతిగా అనిపించినప్పటికీ ఆయన మాటల్లోని లోతులను పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది. బాపు సంపూర్ణ రామాయణం, శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాల్లో సీతారాముల అనుబంధాన్ని అత్యంత అత్మీయంగా చిత్రీకరించారు. నిజానికి వాల్మీకి రామాయణంలోని ఇతివృత్తాలను సారాంశాన్ని సాంఘిక చిత్రాల నిర్మాణానికి ఆయన వాడుకున్న తీరు అనిర్వచనీయమైంది, ముత్యాలముగ్గు సినిమా ఆయన రామాయణ కథా ఇతివృత్తాన్ని తీసుకుని రూపొందించిన అద్భుతమైన సాంఘిక దృశ్యకావ్యం. అందులోని రావణుడి పాత్రను పోలే రావు గోపాలరావు పాత్రను ఎన్నటికీ మరిచిపోలేరు. బాపు మలిచిన ఆ రావు గోపాలరావు రూపానికి ముళ్లపూడి వెంకటరమణ అందించిన సంభాషణలు అవసరమైన చోట ఉటంకిపులుగా పనికి వస్తాయి. మనషన్నవాడికి కాస్తా కళాపోసణ ఉండాలి అని రావుగోపాలరావుతో అనిపించిన డైలాగ్ ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నది. అందాల రాముడు సినిమా గురించి చెప్పనే అక్కర్లేదు. బాపు సినిమాల్లో కొన్ని ఫ్లాట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి ఆధునిక జీవితంలోని వెర్రితలల సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సోగ కళ్ల భామలను విశాలాక్షులను ఆయన కథానాయికలను ఎన్నుకుని అందమంతా ఆ కళ్లలోనే ఉందన్నట్లుగా చూపించారు. మనవూరి పాండవులు కూడా రామాయణ ఇతివృత్తాన్నే ఆధునిక కాలంలోని సామాజానికి అన్వయం చేస్తుంది. ఇందులో కృష్ణంరాజు చేత చేయించిన నటన ఎన్నటికీ మరిచిపోలేనిది. భక్త కన్నప్పఅలో కూడా కృష్ణంరాజు చేత సంభాషణలు చెప్పించిన తీరు చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ఆయన సినిమాల్లోని నటుల ప్రతిభను అతి గొప్పగా వాడుకున్న దర్శకుడు బాపు నుంచి ఇప్పటి దర్శకులు నేర్చుకోవాల్సిన పలు విషయాల్లో ఇది అత్యంత ప్రధానమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: