టాలీవుడ్ సినిమా ఎంట్రీ ఇచ్చి 16 సంవత్సరాలు పూర్తి అయినా ఇప్పటి వరకు నటించింది కేవలం 21 సినిమాలు మాత్రమే అయినా తాను నటించిన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా తన ఇమేజ్ ను ఒక సునామీగా మార్చుకున్న అదృష్టం టాలీవుడ్ లో పవన్ కే దక్కింది. ఎంతమంది యంగ్ హీరోలు వచ్చినా మరెంత మంది హీరోల సినిమాలు సూపర్ హిట్ అయినా పవన్ కళ్యాణ్ మాత్రం తన అభిమానుల గుండెలలో నిజమైన టాలీవుడ్ ఎంపరర్. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ‘తొలిప్రేమ', ‘తమ్ముడు', ‘సుస్వాగతం', ‘బద్రి' మరియు ‘ఖుషి' చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోగా మారిపోయాడు. చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన పవన్ ప్రస్తుతం అభిమానుల ఫాలోయింగ్ తన అన్నను దాటిపోయాడు అన్న మాట వాస్తవం. పవన్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు అతడిలో ఒక రచయిత, దర్శకుడు అన్నిటా మించి ఒక మానవతావాది ఆయనలో అంతర్లీనంగా ఉన్నాడు. ఈ మానవత్వ భావనే పవన్ సినిమాలలో కనిపిస్తూ ఉంటుంది. కమర్షియల్ హీరోగా ఉన్నా తన సినిమాల ద్వారా ఎదో ఒక మంచిని తన అభిమానులకు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాడు పవన్. పుస్తకాలంటే విపరీతమైన అభిమానం ఉన్న పవన్ ఇప్పటి వరకు ఎన్నో వేల పుస్తకాలు చదవడమే కాకుండా ఆయన ఇంట్లో ఒక లైబ్రరీ ఉంది అన్న విషయం బట్టి ఆయనకు ఉన్న విజ్ఞాన పిపాస తెలుస్తుంది. పవన్ సినిమాలు విడుదల రోజున ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. పవన్ సినిమాకు ఉన్న స్టామినా ఏమిటో ‘గబ్బర్ సింగ్’, ‘ అత్తారింటికి దారేది’ చిత్రాలు నిరూపించాయి. పవన్ ‘అత్తారిల్లు’ సినిమా సృస్టించిన రికార్డులను బ్రేక్ చేయాలి అంటే మరి కొంత కాలం పట్టే అవకాసం ఉంది. ‘జానీ' తో దర్శకుడుగా మారిన పవన్ ను ఆ సినిమా ఘోర పరాజయం చెందిన తరువాత పవన్ కెరియర్ అయిపోయింది అని అందరూ అనుకుంటూ ఉంటే సంవత్సరాల గ్యాప్ తీసుకుని తానేమిటో గోడకు కొట్టిన బంతిలా 'జల్సా' ద్వారా నిరూపించాడు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాప్ ల హవా కొనసాగినా 'గబ్బర్‌సింగ్'తో టాలీవుడ్ కు ఒక బ్రాండ్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్. రమణ మహర్షి పుస్తకాలను బాగా చదివే పవన్‌ తన చిన్నప్పటి రోజులలో షాడో నవలల్ని బాగా చదివేవాడట. అంతేకాదు పవన్ కు చలం భావాలంటే బాగా ఇష్టం. దేవుడంటే నమ్మకం ఉన్న పవన్ కు విగ్రహారాధన పై నమ్మకం లేదు అందుకే పూజలు చేయడు. కాని ఆరోగ్యం కోసం ఉపవాసాలు ఉంటాడు. సమాజంలో జరిగే ప్రతి సంఘటనకు స్పందించే పవన్ ఆ సంఘటనల గురించి విపరీతంగా ఆలోచిస్తాడు. ఆ ఆలోచనల నుండి పుట్టిన సంస్థలే 'కామన్‌మేన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌' నుండి నేటి ‘జనసేన’ వరకు సమాజానికి ఒక ఆదర్శవంతమైన రాజకీయాలను చూపించాలని తన ‘జనసేన’ ద్వారా సాంప్రదాయ రాజకీయ పార్టీలకు విరుద్ధంగా ఒక మార్పు కోసం ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్.  పవన్ కోరుకున్న మార్పు సమాజంలో వస్తే అది ఒక చరిత్రకు శ్రీకారం అవుతుంది. 'పవన్‌కి అభిమానులంటూ ఉండరు ఉన్నవాళ్లంతా భక్తులే' అని చెప్తుంటారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. ఈ మాటలు అక్షర సత్యాలు. ఎందు కంటే పవనిజమ్ పేరుతో నేడు ప్రపంచ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. పవన్ రాజకీయాలలో విజయం సాధించి ఈ సమాజానికి ఒక కొత్త ఒరవడి సృష్టించే శక్తి భగవంతుడు పవన్ కళ్యాణ్ కు కలిగించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ కు ఎపి హెరాల్డ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.    

మరింత సమాచారం తెలుసుకోండి: