దర్శకుడు శంకర్ దాదాపు రెండేళ్ళుగా చెక్కుతున్న ‘ఐ’ (మనోహరుడు) ఆడియో వేడుకకు దాదాపు 7కోట్లు ఖర్చు పెడుతున్నారు అనే వార్త కోలీవుడ్ మీడియాను షేక్ చేస్తోంది. దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఆడియో వేడుక ఇప్పటి వరకు ఏ దక్షిణాది సినిమాకు జరగనంత ఘనంగా జరపడానికి ఈ సినిమా నిర్మాతలు ముఖ్యంగా దర్శకుడు శంకర్ భారీ ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో ఇంత భారీ స్థాయిలో ఖర్చు అవుతోందని టాక్. చైనా ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు హైలెట్ గా నిలిచిన ప్రపంచ స్థాయి లేజర్ షోను ‘ఐ’ ఆడియో వేడుకలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈనెల 15న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. దక్షిణాది భాషలలోని ప్రముఖ ఛానల్స్ లోనే కాకుండా ప్రముఖ హిందీ ఛానల్స్ లో కూడ ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రసారం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఫంక్షన్‌కు హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్, రజనీకాంత్, కమల్‌హాసన్, విక్రమ్, అమీజాక్సన్, మలయాళ నటుడు సురేష్ గోపి వంటి నటీనటులు అతిధులుగా రానున్నారని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ స్పెషల్ స్టేజ్ షో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ.  ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ధియేటర్లలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే మొన్నటిదాకా ఈ సినిమాకు టాలీవుడ్ లో మార్కెట్ లేదు అని వార్తలు వినిపించినా ఈ చిత్రం తెలుగు రైట్స్ 35 కోట్లకు వెళ్లినట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్. దీపావళికి సందడి చేయబోతున్న ఈ సినిమా దక్షిణాది సినిమా రికార్డులను తిరగ రాస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: