నిన్న సాయంత్రం జరిగిన ‘గోవిందుడు అందరివాడేలే’’ ఆడియో వేడుకలో బండ్ల గణేష్ అత్యుత్సాహం అందర్నీ ఆశ్చర్య పరిచింది. రామ్ చరణ్ ను ‘లిటిల్ బాస్’ అంటూ సంభోదిస్తూ తన బాస్ మాత్రం పవన్ కళ్యాణ్ అంటూ ఆడియో వేదిక సాక్షిగా ప్రకటించడం అందరికి షాక్ ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకు వేసి చిరంజీవి భార్యను ఉద్దేసించి మాట్లాడుతూ జాతిరత్నం లాంటి హీరోను కన్న ఆమె అదృష్టవంతురాలని కామెంట్ చేస్తూ ఆ వజ్రం వెలుగులో తనలాంటి నిర్మాతలు ఎందరో మరో 30 సంవత్సరాల పాటు సినిమాలు తీస్తారని మెగా భజన చేసాడు బండ్ల గణేష్. ఇదే సందర్భంలో మరో షాకింగ్ సెటైర్ వేసాడు గణేష్. ప్రస్తుతం నిర్మాతల పరిస్థితి బాగాలేదు కాబట్టి కొంతమంది తన సన్నిహితులు తన కుటుంబ సభ్యుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఒక భారీ ఎల్ఐసి పాలసీ చేయించుకోమని సలహా ఇస్తున్నారని అయితే తనకు ఎటువంటి పాలసీ అక్కరలేదని దానికి కారణం తన వద్ద ఎవ్వరి దగ్గర లేని మెగా పాలసి తనకు శ్రీరామరక్షగా ఉందని బండ్ల గణేష్ కామెంట్ చేయడంతో ఆ మితిమీరిన పొగడ్తలకు చిరంజీవి, రామ్ చరణ్ లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకోవడం మీడియా కెమెరాలకు స్పష్టంగా కనిపించింది.  ఇదే సందర్భంలో గణేష్ మాట్లడుతూ తాను ఏ హీరో సినిమా చేస్తే ఆ హీరో భజన చేయడం తన అలవాటు అని చెప్పడం ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో వేడుకకు హైలెట్.  

మరింత సమాచారం తెలుసుకోండి: