సెప్టెంబర్ 20 తెలుగు వారికి ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి ఒక ముఖ్యమైనరోజు. తెలుగు సినిమా బ్రతికి ఉన్నంతకాలం అమరజీవిగా నిలిచిపోయే అక్కినేని పుట్టినరోజు. 90 సంవత్సరాలు దర్జాగా బ్రతికి హుందాగా వెళ్ళిపోయిన అక్కినేని జీవితంలో ప్రతి మనిషికి నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు ఉంటాయి. అక్కినేని లేకుండా నేడు జరుగుతున్న ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా అక్కినేని కుమార్తె నాగసుశీల ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను షేర్ చేసుకున్నారు.  అక్కినేనికి బెల్లంతో తయారైన పరమాన్నం, పెసరట్టు, జిలేబీలు అంటే విపరీతమైన ఇష్టం అట. అందువల్లనే ఈరోజు తమ అక్కినేని కుటుంబం అంతా ఒక చోట చేరి తన తండ్రికి ఇష్టమైన వంటలనే చేయించుకుని అక్కినేని జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ఈరోజు గడుపుతున్నామని నాగసుశీల చెపుతున్నారు.  అక్కినేని హీరో స్టేటస్ అందుకున్నాక కూడా ఎప్పుడు దంపుడు బియ్యంతో వండిన అన్నాన్నే ఇష్టపడే వారని అంటూ, షూటింగులు లేనప్పుడు తన భార్య అన్నపూర్ణకు కిచెన్ లో కూరలు కోస్తూ సహాయ పడుతూ తెగ ఎంజాయ్ చేసేవారని నాగ సుశీల అక్కినేనిని గుర్తుకు తెచ్చుకున్నారు. ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు ఉన్నా అక్కినేని ఉదయాన్నే తన పిల్లలకు, మనవలకు తానే కాఫీ, టీలు అందిస్తూ ఆ పనిలో విపరీతమైన ఆనందాన్ని పొందేవారని అని అంటున్న నాగసుశీల మాటలను బట్టి అక్కినేని నిరాడంబరత అర్ధం అవుతుంది. తాను కొద్దిరోజులలో చనిపోతాను అని తెలిసి కూడా గడిచిన సంక్రాంతికి తన అన్నపూర్ణ స్టూడియోస్ లోని పని వాళ్ళు దాదాపు రెండు వందల మందికి దగ్గర ఉండి వీల్ చైర్ లో కూర్చుని వంటలు చేయించి తినిపించిన అక్కినేనికి ఉన్న ఆత్మ విశ్వాసం తాను ఎవరిలోనూ చూడలేదు అని అంటున్నారు నాగసుశీల. ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టే చనిపోయి సంవత్సర కాలం కాదు ఎన్ని దశాబ్దాలు అయినా అక్కినేని తెలుగు ప్రజల హృదయాలలో చిరంజీవిగా మిగిలిపోతాడు... 

మరింత సమాచారం తెలుసుకోండి: