భారతీయ సంస్కృతిలో పండుగలన్నీ ఒక పరమార్ధం తో ఏర్పడ్డాయి. అందుకనే మన పండుగలలో కనిపించే వేడుకలు వినోదాల వెనుక నిఘూఢమైన అంతరార్ధం దాగి ఉంటుంది. మన భారతీయ సంస్కృతిలోని ప్రతి పండుగ మన బాధ్యతలను గుర్తు చేసే విధంగా ఉంటుంది. భారతీయులు జరుపుకునే పండుగలన్నింటిలో దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. సంధ్యా సమయంలో అందమైన దీపాలు వెలుగుతో ప్రతి ఇల్లు ఈరోజు కళకళలాడుతుంది. రంగు రంగుల బాణా సంచా హోరు మధ్య అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగను మన తెలుగు వారు మూడు రోజుల పండుగగా ఆశ్వీజమాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపు కుంటారు. మొదటి రోజు నరక చతుర్దశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమిగా జరుపు కోవడం మన సాoప్రదాయం. జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా సంకేతంగా దీపాన్ని మనం ఆరాధిస్తాం. దీపం తిమిరాన్ని, అవివేకాన్ని తొలగిస్తుందని ఉపనిషత్తుల సారాంశం. ఏ మంచి పని చేయాలన్నా లేదా ఏ పూజలు చేయాలన్నా దీపాన్ని వెలిగించి ఆరాధన చేయడం వల్ల మానసిక చైతన్యం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం.  శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసుర సంహారం చేసినందుకు ఆనందంగా ద్వాపరయుగం నుండి ఈ దీపావళిని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మహాలక్ష్మి ని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే నమ్మకంతో చాలా మంది లక్ష్మి పూజలు చేస్తారు. ఈరోజు ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని మన హిందువుల ప్రగాఢ విశ్వాసం.  అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు తొలుత దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి 'చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్’ అని ధ్యానించి ఇంటికి వెలుగులు వచ్చే విధంగా దీపాలతో అలంకరిస్తారు. దీపావళి రోజున నెయ్యితో దీపo వెలిగించినా ఫలితం ఉండదని నువ్వులనూనెతోనే దీపాలు పెట్టాలని పండితులు అంటారు. ఎందుకంటే దీపావళి రోజున లక్ష్మీదేవి నువ్వుల నూనెలోనే నివాసముంటుంది అన్నది మాన పూర్వీకుల నమ్మకం.  దీపం వెలుగులు ఎక్కడైతే విరజిమ్ముతూ ఉంటాయో అక్కడ దుష్టశక్తులు నివాసం ఉండవు అని మన పెద్దలు చెపుతూ ఉంటారు. దీపావళి రోజున కుల, మతాలతో సంబంధం లేకుండా చేసుకుంటున్నాము అన్నది నమ్మలేని నిజం. ఎన్నో పండుగలు ఉన్నా దీపావళి పండుగ చేసి హడావిడి మనకు మరే పండుగలోను కనిపించదు అనేది వాస్తవం.  అందరు సరదాగా కాల్చుకునే బాణా సంచా మార్కెట్ విలువ మనదేశంలో రెండున్నర వేల కోట్ల రూపాయలు అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే సంగతి. మన దేశంలో ఒక్క దీపావళి రోజురాత్రి జనం ఆనందంగా కాల్చే బాణాసంచా విలువ రెండువేల కోట్ల రూపాయల పైనే ఉంటుంది అనేది ఒక అంచనా. మనం కాల్చే బాణా సంచాలో ఎక్కువ భాగం తమిళనాడు లోని శివకాశిలో తయారుచేసినా ఇప్పటికీ మనం 400 వందల కోట్ల బాణా సంచాను చైనా నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నాo.  ఆనందాలకు, వెలుగులకు, ఐశ్వర్యాలకు చిరునామాగా ఉండే ఈ దీపావళి మన అందరి గృహాలలో వెలుగులు నింపి సంతోషాలను కలిగించాలని కోరుకుంటూ ప్రస్తుతం భారతదేశాన్ని పీడిస్తున్న అనేక సమస్యల చీకట్లను ఈ దీపావళి తొలగించాలని మనసారా కోరుకుంటూ ఆ తల్లి అనుగ్రహంతో సిరిసంపదలు మనందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహంచాలని కోరుకుందాం...  

మరింత సమాచారం తెలుసుకోండి: