సంగీత ప్రపంచం ఓ ఆణిముత్యాన్ని కోల్పోయింది. తన సంగీతంతో పలువురి గుండెల్ని కరిగించిన చక్రీ గుండెపోటుతో కన్నుమూశారు. చక్రీ సంగీతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. సంగీత ప్రపంచం మూగబోయింది.. స్వరం ఆగిపోయింది.. సంగీతం ప్రేమికులకు చక్రీ సంగీతం నవనాడుల్లో నాదాన్ని పుట్టిస్తుంది.. యువతను మాయగాళ్లు చేసి యువతుల వెంట ఉరుకులు పరుగులు పెట్టిస్తాయి. బాచి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన చక్రీ తన ప్రయాణాన్ని ఎర్రబస్సుతో ఆపేశారు. తండ్రి నుంచి సంగీత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న చక్రీ కోట్ల మంది గుండెల్లో తన స్వరాన్ని దాచుకున్నారు. ఇంటర్ నుంచే కర్ణాటక సంగీతాన్ని, వయోలీన్‌ను నేర్చుకోవడం ప్రారంభించిన ఆయన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శిక్షణ ఇచ్చేవాడు. 18 ఏళ్లకే ఒకే జాతి మనదిరా.. ఒకే బాట మనదిరా అనే పాట రాసి తన ప్రతిభను చాటుకున్నాడు. సుమారు 40 వరకు అల్బమ్స్ చేశాడు. ఇక పిలిచిన పలకదు ప్రేమ.. వలచిన దొరకదు ప్రేమ అనే పాట ద్వారా యువత గుండెల్లో చక్రీ ఓ ముద్ర వేసుకున్నారు. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే అనే పాటతో వన్‌సైడ్ ప్రేమికుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. జగమంతా కుంటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే పాటతో పలువురి హృదయాల బరువెక్కించాడు. జై బోలో తెలంగాణ చిత్రానికి మంచి సంగీతం అందించి పలువురి ప్రశంసలు పొందాడు. చక్రీ తల్లిదండ్రులు వెంకటనారాయణ, విద్యావతి. పదో తరగతి వరకు కంబాలపల్లిలో కొనసాగింది. అనంతరం ఇంటర్, డిగ్రీ వరంగల్ జిల్లాలో పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత జూన్ 14, 1985న హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. అప్పుడు చక్రీ నెల సంపాదన రూ. 1300. అనంతరం మ్యూజిక్‌పై మక్కువ ఎక్కువ కాబట్టే కృష్ణా నగర్‌లో అడుగుపెట్టాడు. అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యం సినిమాకు బెస్ట్ మ్యూజిక్ అందించిన చక్రీకి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. 98 చిత్రాలకు సంగీతాన్ని అందించడమే కాకుండా పలువురి గాయనీ, గాయకులకు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. కౌసల్య, సింహ, రఘు కుంచే, రవి వర్మ లాంటి గాయకులకు చక్రీ లైఫ్‌నిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: