టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించినంత వరకు చిరంజీవి ఒక మెగా ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ నుండి ఇప్పటికే ఎందరో మెగా కుటుంబ హీరోలు తయారై బయటకు వచ్చి తమ హవాను చాటుతున్నారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమా మెగా అభిమానులకు పూర్తిగా నచ్చక పోవడానికి చిరంజీవి వరుణ్ తేజ్ విషయంలో తీసుకున్న తప్పు వ్యూహాత్మక నిర్ణయం అనే మాటలు వినిపిస్తున్నాయి.  ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం వరుణ్ తేజ్ తొలి సినిమాకు దర్శకులుగా పనిచేయడానికి పూరి, వివి వినాయక్, బోయపాటి లాంటి కమర్షియల్ డైరక్టర్లు ఎన్నో కథలు చెప్పినా అవేమి కాకుండా చిరంజీవి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ తో ఉండే సినిమాలను తీయగల సత్తా ఒక్క శ్రీకాంత్ అడ్డాలకు మాత్రమే ఉంది అంటూ ఏరికోరి శ్రీకాంత్ అడ్డాలకు ఓటు వేసాడు అని టాక్.  దీనితో అప్పటి వరకు పక్కా మాస్ సినిమా చేద్దాం అని అనుకున్న వరుణ్ తేజ్ కూడా చిరంజీవి ప్రభావంతో తన నిర్ణయం మార్చుకున్నాడని టాక్. అయితే ఫ్యామిలీ సినిమాలను తీసే శ్రీకాంత్ అడ్డాల తన పద్ధతి మార్చి వరుణ్ తేజ్ పై చేసిన ప్రయోగంగా ‘ముకుంద’ మారడంతో వరుణ్ తేజ్ తనకు లభించిన మొట్టమొదటి అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక పోయాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. అదీకాకుండా క్రిస్మస్ టైమ్ ను టార్గెట్ చేసుకుంటూ వచ్చిన ‘ముకుంద’ రాంగ్ టైమ్ లో వచ్చిందనీ అలా కాకుండా సంక్రాంతికి ఈ సినిమా వచ్చి ఉంటే ఈసినిమా కలెక్షన్స్ మరింత బాగుండేవని అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా మొదటి సినిమాతోనే సంచలనాలను సృష్టిద్దాం అని అనుకున్న వరుణ్ తేజ్ కల పగటికల గానే మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: