ఆంధ్రప్రదేశ్ లో సినిమా చూసే ప్రతిఒక్కరికి రామానాయుడు పేరు సుపరిచితం. ఎప్పటికప్పుడు తనదైన ట్రెండ్ సృష్టించటం ఆయనకు మాత్రమే సాధ్యం. రాముడుభీముడు కావచ్చు ప్రేమనగర్ కావచ్చు… ఆ తరువాత వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమానే తీసుకుంటే.. అప్పటివరకూ వచ్చే ప్రేమకథా చిత్రాలకు సరికొత్త రంగు, రుచిని ఇచ్చింది ఆ సినిమా. ఒక రకంగా ఆయన్ను ట్రెండ్ సెట్టర్ గా చెప్పొచ్చు. మూసధోరణిని బద్ధలుకొట్టి… చిత్రనిర్మాణాన్ని సరికొత్త దిశగా నడిపే నేర్పు రామానాయుడు సొంతం. సినిమారంగంలో పలు విజయాలు సాధించిన ఆయన రాజకీయ రంగంలోనూ విజయం సాధించారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2004లో మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమ ఈ స్థాయిలో ఉందని చెప్పుకోవడానికి ప్రధాన కారకులైన వారిలో ప్రధమంగా చెప్పుకోవల్సింది రామానాయుడు గారి పేరునే. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా రామానాయుడు పెద్ద పెద్ద ఈవెంట్స్ లోనూ, అలాగే ప్రవేట్ ఫంక్షన్స్ లోనూ కనిపించడంలేదు. ప్రముఖ పత్రిక కథనం ప్రకారం, ప్రస్తుతం రామానాయుడుకి అనారోగ్యంగా ఉండడం వల్ల బయటకి రావడం లేదని తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రావటం లేదు. ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పితే, రామానాయుడి గారి ఆరోగ్యం గురించి మరెవ్వరికీ సరైన న్యూస్ తెలియడంలేదు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్ద వ్యక్తుల నుండి అందిన సమాచారం ప్రకారం, తను వ్యక్తిగత కారణాలతోనే ఫంక్షన్స్ కి హాజరుకావడంలేదని, అంతకు మించి ఇందులో ఏమి లేదని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: