నిన్న సాయంత్రం అన్నపూర్ణా స్టూడియోలో అక్కినేని కుటుంబ సబ్యులు నిర్వహించిన అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ జాతీయ అవార్డును బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా అందించారు.  ఈ సందర్భంలో అమితాబ్ మాట్లాడుతూ తనకు మహా నటుడు అక్కినేని పై నెలకొల్పిన జాతీయ అవార్డు తాను తీసుకోవడం ఒక గొప్ప అనుభూతిగా దానికి మించి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని అంటూ అక్కినేని తెలుగు సినిమా రంగానికే కాదు యావత్ చిత్ర పరిశ్రమకు గర్వించ తగ్గ మహానటుడు అంటూ అక్కినేని గుణ గణాలను ఆకాశానికి ఎత్తేసారు అమితాబ్. అక్కినేని ఆశయాలకు అనుగుణంగా ఆయన పిల్లలు కూడా ఎదగడం గర్వింప తగ్గ విషయమని అంటూ నాగార్జున పై పొగడ్తల వర్షం కురిపించారు అమితాబ్.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ భాగ్యనగరాన్ని తెలుగు చిత్ర రంగానికి ఆలవాలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అంతేకాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఇంతకు వంద రెట్లు అభివృద్ధి చెందాల్సి ఉంది అని అంటూ ఇందుకు త్వరలోనే పరిశ్రమ ప్రముఖులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా కెసిఆర్ ప్రకటించారు.  తనకు అమితాబ్ పట్ల ఉన్న అభిమానాన్ని వ్యక్త పరుస్తూ పని ఒత్తిడి వల్ల అలసట అనిపించినప్పుడల్లా అమితాబ్ నటించిన ‘అభిమాన్’ సినిమా చూస్తే తన అలసట పోతుందని అమితాబ్ ను ప్రశంసలతో ముంచెత్తి వేసారు కెసిఆర్. రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలామందికి దూరం అవుతారని, కానీ అటువంటి పని అక్కినేని చేయకుండా సినిమాల్లోకి వచ్చి అందరికీ దగ్గర అయి 91 ఏళ్ల జీవితంలో 75 ఏళ్లు నటుడిగా కొనసాగిన ఏకైన వ్యక్తిగా అక్కినేని చరిత్రలో నిలిచిపోతారని అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులంతా అక్కినేని గొప్పతనాన్ని మరోసారి గుర్తుకు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి నిండుతనం తీసుకు వచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: