ఈ మధ్య కాలంలో కేవలం నెల రోజులు గడవ కుండానే ప్రముఖ హాస్య నటుడు ఎమ్.ఎస్. నారాయణ ఆ తరువాత ప్రఖ్యాత నిర్మాత డి. రామానాయుడు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరి ప్రముఖుల మరణాలు టాలీవుడ్ లోని వైరుధ్యాలను మరియు వర్గ పోరును మరో సారి తెర పైకి తీసుకు వచ్చింది. పైకి టాలీవుడ్ పరిశ్రమ అంతా ఐక్యంగా ఉంది అని చెప్పుకుంటూ రోజులు గడుపుతున్నా టాలీవుడ్ పరిశ్రమలో పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు పెద్ద నటులు చినన్న నటులు అన్న వర్గాలుగా విడిపోవడమే కాకుండా ధన కుల ప్రాతిపదికల మధ్య టాలీవుడ్ సినిమా రంగం ఎప్పుడూ నివురుకప్పిన నిప్పులా ఉంటోంది.

ఈ నేపధ్యంలో ఈరోజు ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఒక ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిశ్రమ పై తన అసహనాన్ని వ్యక్త పరిచారు. ఎమ్.ఎస్. నారాయణ తరువాత తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎమ్. ఎస్. పై ఒక సంతాప సభ పెట్టమని అడిగితే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ పెద్దలు ఇటువంటి సంతాప సభల పద్ధతులను మానివేసామని తనకు షాకింగ్ రిప్లయ్ ఇచ్చారని పేర్కొన్నారు.

అయితే రామానాయుడు చనిపోయిన తరువాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంతాప సభను పెడితే అనేక మంది నిర్మాతలతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలు కూడా రామానాయుడు సంతాప సభలో పాల్గొని నివాళులు అర్పించారని కామెంట్ చేసాడు భరద్వాజ.

ప్రముఖ నిర్మాతగా రామానాయుడు చేసిన కృషికి నివాళిగా సంతాప సభలు ఏర్పాటు చేయడంలో తప్పులేదు కాని నిర్మాతగా డైరెక్టర్ గా యాక్టర్ గా రైటర్ గా అనేక రంగాలలో ప్రావీణ్యత చూపెట్టిన ఎమ్.ఎస్. నారాయణకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు ఏ ఇతర టాలీవుడ్ సినిమా రంగానికి చెందిన సంఘం ఎమ్.ఎస్. వర్ధంతి సభను ఏర్పాటు చేయక పోవడం తనకు ఆశ్చర్యం కలిగించే విషయంగా మారింది అంటూ కామెంట్లు చేసారు భరద్వాజ. దీనిని బట్టి చూస్తూ ఉంటే సినీ ప్రముఖుల మరణాలలో కూడా రాజకీయాలు ఉన్నాయా అని అనిపించడం సహజం.

మరింత సమాచారం తెలుసుకోండి: