టాలీవుడ్ లో సినిమాలు తీయాలి అని భావిస్తున్న దర్శక నిర్మాతలకు ప్రస్తుతం నడుస్తున్న ఇంట్రడక్షన్ సీన్స్ మ్యానియా ఒక సమస్యగా మారింది అని వార్తలు వస్తున్నాయి. రోజురోజుకుకు పెరిగి పోతున్న నటీనటుల పారితోషికాల సమస్యలతో పాటు నేడు చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు పెరిగిపోయిన ఈ ఇంట్రడక్షన్ సీన్స్ హంగామా నేటి హీరోల మధ్య పోటిగా మారిపోయి దర్శక నిర్మాతలను టార్చర్ పెట్టే స్థాయికి చేరిపోయింది.

గత సంవత్సరం విడుదల అయిన మహేష్ ‘ఆగడు’ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ కోసం ఆ సినిమా నిర్మాతలు 2 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఈ క్రేజ్ ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. అసలు టాలీవుడ్ లో ఈ ఇంట్రడక్షన్ సీన్స్ సంస్కృతికి సీనియర్ ఎన్టీఆర్ శ్రీకారం చుట్టితే దానిని సూపర్ స్టార్ కృష్ణ మెగా స్టార్ చిరంజీవిలు మరింత పెంచారు అనే కామెంట్స్ ఉన్నాయి.

ఈ విషయమై దర్శకుడు హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కు బ్లాకు బస్టర్ హిట్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ విజయంలో ఇంట్రడక్షన్ సాంగ్ కోసం తానూ వారం రోజులు ఆలోచించి ఎంతో కష్టపడి తీసాను అని చెపుతున్నాడు. అంతే కాదు ప్రస్తుత పరిస్థితులలో సినిమాల విజయంలో ఇంట్రడక్షన్ సీన్స్ చాలా కీలకంగా మారాయి అని అభిప్రాయ పడుతున్నాడు.

అయితే ఇంత భారీ ఖర్చుతో ఇంట్రడక్షన్ సాంగ్స్, ఫైట్స్ తీసిన ప్రతి సినిమా విజవంతం అయిన దాఖలాలు లేవు. ఎటువంటి ఖర్చు లేకుండా అసలు ఇంట్రడక్షన్ సాంగ్ లేకుండా తీసిన ‘మనం’, ‘దృశ్యం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ వాస్తవాలను మన తెలుగు హీరోలు గుర్తించనంత వరకు మన తెలుసు సినిమాల బడ్జెట్ కు అంతం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: