ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఫెయిల్యూర్ పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్న వరుణ్ సందేష్ కు బ్రహ్మానందం విలన్ గా మారాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఆశ్చర్యం గా మారినా ఇది నిజం. బ్రహ్మి ఎలాంటి పాత్రలలో అయినా ఒదిగిపోయి ఇట్టే నవ్విస్తాడు అన్న విషయం తెలిసిందే. బ్రహ్మానందం విలన్ గా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఊహ విచిత్రంగా ఉన్నా ఆ ఊహ నిజం చేయబోతున్నాడు.

వరుణ్ సందేశ్ హీరోగా ‘లవకుశ’ అన్న సినిమా త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ సందేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే మరో ట్విస్ట్ ఏమిటంటే ఇదే సినిమాలో బ్రహ్మీ ఒక నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని నిన్న ఈ సినిమా ప్రచారగీతం విడుదల కార్యక్రమంలో ప్రకటించారు.

బ్రహ్మానందం కోసం రొటీన్ పాత్ర కాకుండా విలన్ షేడ్స్ తో ఉండే ఒక పాత్రను డిజైన్ చేసి బ్రహ్మికి ఆ పాత్ర వివరించినప్పుడు బ్రహ్మానందం ఆ పాత్ర చేయడానికి ఇష్టపడతాడా అని భయపడ్డారట. అయితే ఇప్పటికే 1000 సినిమాలలో రకరకాల హాస్య పాత్రలు చేసి నవ్వించిన బ్రహ్మానందం తాను ఇలాంటి పాత్రలనే కోరుకుంటున్నానని చెపుతూ ఈ సినిమా దర్శక నిర్మాతలను ప్రోత్సహించాడట.

బ్రహ్మి కామెడీ సీన్స్ రొటీన్ గా మారిపోతున్నాయి అనే విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమాలోని బ్రహ్మానందం పాత్రకు మంచి పేరు వస్తే ఇక భవిష్యత్ లో ఈ నవ్వుల చక్రవర్తి టాలీవుడ్ విలన్స్ లిస్టులో చేరిపోతాడేమో చూడాలి. ఈ సినిమా ప్రయోగం అయినా వరుణ్ సందేష్ కు కలిసి వస్తే అదృష్టమే అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: