నాగార్జున నటించిన డమరుకం సినిమా శనివారం విడుదలవ్వాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. దాంతో నిరాశ చెందిన నాగ్ అభిమానులు పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అభిమానులను శాంతింపచేసే ప్రయత్నం మొదలు పెట్టారు నాగ్. సినిమా విడుదలకు శివుని ఆజ్ఞ రాలేదని ఆధ్యాత్మిక ధోరణిలో మాట్లాడారు. ఓ ప్రయివెట్ కార్యక్రమం కోసం కాకినాడ వెళ్ళిన నాగ్ ఈశ్వరుడు ముహూర్తం పెట్టగానే డమరుకం విడుదలవుతుందన్నాడు. ఎవరూ ఆందోళన చెందవద్దని, సినిమా త్వరలోనే విడుదల అవుతుందని నాగ్ స్పష్టం చేశాడు. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా గత సంక్రాంతి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. గ్రాఫిక్స్ వర్క్ పూర్తికాకపోవడం వల్లే ఈ సినిమా ఆలస్యం అవుతుందంటూ చిత్రయూనిట్ చెబుతోంది. సినిమాకు ఊహించని బడ్జెట్ అయిందని, ఆర్థిక సమస్యలతోనే సినిమా వాయిదాపడుతున్నట్టు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెట్స్ మీద ఏడాదిన్నర, పోస్ట్ ప్రొడక్షన్ లో ఆర్నెల్లు.. భారీ గ్రాఫిక్స్ వర్క్.. ఇవన్నీ తడిసి మోపెడై బడ్జెట్ ఆమాంతం పెరిగిందని అంటున్నారు. అయితే ఇంత గందరగోళానికి కారణమెవ్వరని ఆరా తీస్తే.. ఒక్కొక్క విషయం బయటపడుతోంది. పెద్ద హీరోను, నిర్మాతను తన సబ్జెక్టుతో ఒప్పించిన చిన్న డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి.. షూటింగ్ ను విసుగు పుట్టేంత వరకు కొనసాగించారని టాక్. షూటింగ్ షెడ్యూల్ సాగదీసే కొద్దీ ఖర్చు బారెడు అయిపోతుండడంతో నిర్మాత తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడని ఫిలిం జనాలు అంటున్నారు. ఒక దశలో సినిమా పూర్తవ్వడమే కష్టమన్న పరిణామాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఖర్చులు తడిసి మోపెడైన ఈ సినిమాను కొనడానికి పెద్దగా ఎవరు ముందుకు రావడంలేదని సమాచారం. అంతేకాదు ఈ సినిమా చూసిన బయ్యర్లు కూడా పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. సినిమా పాటలు, ట్రైలర్స్ ఓ మోస్తారు అంచనాలను తీసుకువచ్చాయి. అయితే సినిమా మాత్రం అనుకున్న రేంజ్ లో లేదనే, అందుకే బయ్యర్లు దూరముంటున్నారని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతున్న ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. సినిమాలకు సినిమా కష్టాలు రావడం కొత్తేం కాదు.. కానీ చిన్నపాటి సమస్యతో నాగ్ లాంటి హీరో సినిమా వాయిదాపడటమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మరి ఫైనల్ గా ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రకటించలేని పరిస్థితి నెలకొందిప్పుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: