‘మా’ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవడంతో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న జయసుధ తన ప్రచార వేగాన్ని పెంచింది. టాలీవుడ్ లోని ప్రముఖ నటీనటుల ఇంటికి వ్యక్తిగతంగా వెళుతూ తనకు తన ప్యానల్ కు ఓట్లు వేయమని కోరుతూ తీవ్ర ప్రచారం చేస్తోంది. ఈ ఎత్తుగడలో భాగంగా జయసుధ సూపర్ స్టార్ కృష్ణ ఇంటి నుండి తన ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మలతో తనకు ఉన్న బంధుత్వ రీత్యా వారి సలహాలను తీసుకుని తన ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

ఇది ఇలా ఉండగా నిన్న సాయంత్రం జయసుధ ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఘాటైన కామెంట్లు చేసింది. మా ఎన్నికలు ఇంత దారుణంగా వుంటాయని తాను భావించలేదని అంటూ ఎదుటి మనిషిని కించపరుస్తూ మాట్లాడే తత్వం తనకు లేదని స్పష్టం చేసింది జయసుధ. తాను ఓ డమ్మీ క్యాండిడెట్ అని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మురళీమోహన్ తనను సపోర్టు చేస్తున్నంత మాత్రాన ప్రతి విషయం ఆయన చెప్పినట్లే చేస్తూ  ఉండటానికి తాను కీలు బొమ్మను కాదని స్పష్టం చేసింది.

అంతేకాదు ‘మా’ సంస్థలో ఉన్న వాళ్లంతా కళాకారులే అంటూ పని వున్న కళాకారులు, పనిలేని కళాకారులు అని తేడాలేమీ లేవని సమాధానం ఇచ్చింది జయసుధ. ప్రస్తుతం ఉన్న కళాకారుల్లో ఎంతమందికి పెన్షన్, హెల్త్ కార్డులు అవసరం అనే అంశాల్ని పరిశీలించి తాను నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది.  అన్ని విభాగాల్లో వున్నట్లే మూవీ ఆర్టిస్ట్సు అసోసియేషన్‌లోనూ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జయసుధ తెలిపింది. 

ఇదే ప్రెస్‌మీట్‌లో నటి హేమ మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ మా అసోసియేషన్‌కి ఇప్పటికిప్పుడు రూ. 5 కోట్లు ఫండ్ డొనేట్ చేస్తే, తక్షణమే అధ్యక్ష పదవి ఎన్నికల రేసులోంచి పక్కకు తప్పుకోవడానికి తమ ప్యానెల్ సిద్ధంగా వుందని సవాల్ విసిరింది. అయితే ఈ మాటలకు ఖంగు తిన్న జయసుధ హేమ మాట్లాడుతుండగానే మధ్యలో కలుగజేసుకుని అలా మధ్యలో ఎన్నికల నుంచి తప్పుకోవడానికి గాజులేసుకుని కోర్చోలేదని అంటూ జయసుధ చేసిన కామెంట్లకు మీడియా వర్గాలు కూడా షాక్  అయ్యాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: