‘ప్రైవేటుగా ఉన్నంత వరకూ మీ జోలికి మేం రాం... పబ్లిక్‌ లోకి వచ్చిన తర్వాత ఏమైనా అంటాం’ అంటాడు శ్రీశ్రీ తన కవితలో. నిజమే కావొచ్చు.. పబ్లిక్‌లైఫ్‌ లోకి వచ్చిన తర్వాత.. దానితోపాటూ వచ్చే కొత్త ప్రత్యర్థుల్ని, విమర్శల్ని అన్నిటినీ స్వీకరించాల్సిందే. అంతమాత్రాన పాయింటుకు సంబంధంలేని విమర్శలను కూడా ఎవరైనా సంధిస్తే భరించాల్సిందేనా.. లేక తిప్పికొట్టాలా? అదే మీమాంస ఇప్పుడు అమితాబ్‌ ఫ్యామిలీలో ఉండొచ్చు. యోగా నేర్పే బాబా మీద అమితాబ్‌ కుటుంబంతో ఆగ్రహంతో ఊగిపోతున్నదిట.


రాందేవ్‌ బాబాకు సంబంధించిన వివాదాలు ఎప్పుడూ పతాక శీర్షికల్లో ఉంటూనే ఉంటాయి. అలాగే తాజాగా ఆయన అమ్మే పుత్రజీవ్‌ బీజ్‌ మందు కూడా ఏకంగా రాజ్యసభలో  ఒక బీభత్సమైన చర్చకు కారణమైంది. కొందరు ఎంపీలు ఏకంగా ఆ మందును నిషేధించేయాలని డిమాండ్లు వినిపించారు. అలాంటి వారిలో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఎంపీ జయాబచ్చన్‌ కూడా ఉన్నారు. 


వీరి విమర్శలను తిప్పికొట్టడానికి సహజంగానే రాందేవ్‌ బాబా తెరమీదికి వచ్చారు. తన మందు నిజంగానే గొప్పదని, వనమూలికల గురిచి జ్ఞానం లేని వారే దాన్ని విమర్శిస్తున్నారని ఆయన చెప్పుకున్నారు. అయితే ఆయన పాయింటును పక్కన పెట్టి.. జయాబచ్చన్‌ కు ఇటీవలి కాలంలో ఎవరూ సినిమా అవకాశాలు ఇవ్వడం లేదని అందుకే ఇలా మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. అయినా యోగా నేర్పుకునే బాబా గారికి.. కోపం వస్తే.. తన మీద వచ్చిన విమర్శలకు జవాబివ్వాలే తప్ప.. ఆమెకు సినిమా అవకాశాలు రావడం లేదేమో.. లాంటి వెటకారపు సెటైర్లు ఎందుకు వేయాలంటూ పలువురు ఆయననే తప్పుపడుతున్నారు. 


మొత్తానికి రాందేవ్‌ స్పందించిన వైఖరిపై అమితాబ్‌ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహంగా ఉన్నారుట. ఆయన తనపై విమర్శలకు సూటిగా సమాధానం ఇవ్వలేక ఇలాంటి చవకబారు పర్సనల్‌ విమర్శలు చేయడం తగదని వ్యాఖ్యానిస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: