సినిమా వాళ్లకు ఉన్నంతగా ముహూర్తాల సెంటిమెంట్లు మరెవ్వరికీ ఉండవేమో! అంతమాత్రాన.. ఏదో సినిమా పనులకు ఈ ముహూర్తాల సెంటిమెంట్లు పెట్టుకుంటే బాగానే ఉంటుందేమో గానీ.. గ్రహాలన్నింటికీ సర్వాధిపతి, సర్వాంతర్యామి అయిన భగవంతుని సేవను అందిపుచ్చుకోడానికి కూడా ముహూర్తాలను ఎంచుకోవడం పెద్ద కామెడీగా ఉంటుంది. అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రం అదే పనిచేస్తున్నారు. 


తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టుబోర్డు నియామకం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. చదలవాడకృష్ణమూర్తి ఛైర్మన్‌గా బోర్డులోని సభ్యులు 13 మంది శనివారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ బోర్డులో రాఘవేంద్రరావుకు కూడా చోటు దక్కింది. అన్న ఎన్టీఆర్‌ కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి.. ప్రచారచిత్రాలు రూపొందించడంలో చాలా సహాయం చేస్తున్నందుకు గాను.. రాఘవేంద్రరావుకు ఈ పదవి దక్కింది. నిజానికి ఆయన అధ్యక్ష పదవే కోరుకున్నారు గానీ.. చంద్రబాబు ఇవ్వలేదు. పైగా ఆయన తిరుమలలో తలనీలాలు సమర్పించుకున్న రోజునే బోర్డు ప్రకటన కూడా వచ్చింది. ఆయన కూడా భగవత్సేవకు అవకాశం వచ్చిందని ఆనందించారు. 


అయితే శనివారం మిగిలిన సభ్యులతో మాత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. బోర్డు మొత్తం ప్రమాణం చేసినప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి హాజరై కూడా మిన్నకుండిపోయారు. తన వ్యక్తిగత జాతకానికి సెట్‌ అయ్యేలా మరో మంచి ముహూర్తం చూసుకుని ప్రమాణం చేస్తానని.. ఆయన టీటీడీ అదికార్లకు చెప్పారుట. అయినా సర్వోన్నతుడైన భగవంతుని సేవకు వచ్చిన అవకాశాన్ని జాగు లేకుండా అందుకోకుండా.. ఈ ముహూర్తాల పిచ్చేంటని పలువురు అనుకుంటున్నారు. 


ఫరెగ్జాంపుల్‌.. తమరి సినిమా ప్రారంభానికి ఓ ముహూర్తం పెట్టారనుకోండి. రచయిత వచ్చి ముహూర్తం రోజున టెంకాయ కొట్టకుండా.. ‘నా వ్యక్తిగత జాతకానికి అనుగుణంగా మరొకరోజు టెంకాయ కొడతా’ అంటే తమకెలా ఉంటుంది. ఇది కూడా అలాంటిదే డైరక్టర్‌గారూ.. కాస్త అర్థం చేసుకోండి!!


మరింత సమాచారం తెలుసుకోండి: