కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సినిమాలను పూర్తిగా తగ్గించివేసి గత కొన్ని సంవత్సరాలుగా తన పిల్లలను టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలుగా ప్రమోట్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఎన్నో సినిమాలను తన సొంత బ్యానర్ పై తన కుమారుల చేత నిర్మింప చేస్తున్నాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచు కుటుంబం కోరుకునే సూపర్ హిట్లు వారి కుటుంబానికి వచ్చి చాల సంవత్సరాలు గడిచిపోయాయి.


మోహన్ బాబు ఒక మరాఠీ సినిమా రీమేక్ 


ఈ నేపధ్యంలో ఇక లాభం లేదని మోహన్ బాబు తానే స్వయంగా రంగంలోకి దిగి ఒక కొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మంచు కుటుంబం నిర్మించిన ‘దేనికైనా రెడీ’, ‘పోటుగాడు’ లాంటి సినిమాలు విజయం సాధించడానికి కారణం అయిన రీమేక్ సెంటిమెంట్ ను నమ్ముకుని మోహన్ బాబు ఒక మరాఠీ సినిమా రీమేక్ హక్కులను ఈ మధ్యనే కొన్నట్లు టాక్


ఈసినిమాలో మోహన్ బాబు 50 సంవత్సరాలు పై బడిన ఒక మధ్య వయస్కుడైన ప్లే బాయ్ పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. ఈ కథ అంతా మధ్య వయస్కులైన నలుగురి హీరోయిన్స్ చుట్టూ తిరుగుతుంది. పూర్తిగా హాస్య భరితంగా ఉండే ఈ సినిమాలో మోహన్ బాబు బాడీ లాంగ్వేజ్ కు తగ్గ పంచ్ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు అప్పుడే ప్రారంభం అయ్యాయి అనే వార్తలు కూడ వస్తున్నాయి.


మోహన్ బాబుతో కలిసి నటించబోయే హీరోయిన్స్


మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో మోహన్ బాబుతో కలిసి నటించబోయే హీరోయిన్స్ గా భూమిక, నగ్మా, సిమ్రాన్, రమ్యకృష్ణ ఇప్పటికే ఎంపిక అయ్యారు అని టాక్. ఒక ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించబోయే ఈ సినిమా వివరాలు మంచు మనోజ్ పెళ్ళి హడావిడి పూర్తి అయిన తరువాత మోహన్ బాబు స్వయంగా ప్రకటిస్తాడు అని అంటున్నారు. మరి ఈ ఆరు పదుల వయస్సులో మోహన్ బాబు ఆ నలుగురితో చేసే రొమాన్స్ ఎంత వరకు రక్తి కడుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: