అనగనగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి.. ఇద్దరూ కలసి సహజీవనం చేయాలని అనుకుంటారు. ఒకరి గురించి ఒకరు పట్టింపు, బాదరబందీ లేకుండా బతకాలనుకుంటారు. ఆ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.. ఎలాంటి అనుబంధాల ఇబ్బందులు ఎదురయ్యాయి.. అనేదే మణిరత్నం తీసిన ఓకే బంగారం సినిమా కథ. ఇప్పుడు అదే కథ ఒక టీవీ హీరోయిన్ జీవితంలో వాస్తవ రూపం దాల్చింది. కొన్నాళ్లనుంచి సహజీవనం చేస్తున్న వ్యక్తితో తగాదాలు ఆమెను ఆత్మహత్య వరకూ తీసుకువెళ్లాయి.


వివరాల్లోకి వెళితే హైదరాబాదులో రూప అనే టీవీ నటి ఉంది. అయదేళ్లుగా ఆమె టీవీ సీరియళ్లలో నటిస్తూనే ఉంది. చంద్రముఖి, ఆటో రాణి, అంతపురం, శిఖరం వంటి సీరియళ్లు చేసింది. టీవీ నటిగా ఆమెకు పరిచయ వర్గాల్లో ఒక క్రేజ్ ఏర్పడడంతో సమీప బంధువు కూడా అయిన కేవల్ సింగ్ అనే వ్యక్తి ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపాడు. అది కాస్తా సహజీవనం వరకు వెళ్లంది. కొంతకాలంగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే టీవీ నటి అనే ఉద్దేశంతో ఏ క్రేజ్ తో అయితే కేవల్ సింగ్ ఆమెను ప్రేమించాడో.. అదే టీవీ రంగానికి ఆమెను దూరం చేయదలచుకున్నాడు. ఆమెను టీవీ ల్లో నటించవద్దంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అయితే ఆమె ససేమిరా అంది.


కొంతకాలానికి రూప.. అతనిని పెళ్లి చేసుకోవాల్సిందిగా అడిగింది. అయితే టీవీ నటి ని పెళ్లి చేసుకోవడానికి తన ఇంట్లో పెద్దలు అంగీకరించడం లేదంటూ అన్నాళ్లు సహజీవనం చేసిన కేవల్ సింగ్ రిజెక్ట్ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రూప హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కాకపోతే లేక్ పోలీసులు ఆమెను రక్షించారు. కేవల్ సింగ్ మీద పోలీసు కేసు కూడా నమోదు చేయించారుట.


అంతా బాగానే ఉంది గానీ.. ఇది ఓకే బంగారం కథనే గుర్తుకు తెచ్చేలా ఉంది. సహజీవనం ఎన్ని రకాలుగా బెడిసి కొడుతుందో, సహజీవనం చేయదలచుకునే వాళ్లు ఎలాంటి ఒప్పందాలతో ముందుకు వెళ్లాలో.. తెలుసుకోవాలని పించేలా ఉన్నదని పలువురు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: