హీరోయిన్ల అందాలను సినిమా స్కోప్ లో చూపించే రాఘవేంద్రరావు షూటింగ్ గ్యాప్ లో ఏం చేస్తాడు? మెగాస్టార్ చిరంజీవి కష్టపడి పైకొచ్చాడా లేదా ఏదైనా షార్ట్ కట్ తోటి ఎదిగాడా? రాత్రి పూట షూటింగ్ అయితే హీరో హీరోయిన్స్ కలిసి ఏంచేస్తారు? వీటన్నింటి జవాబులు చెప్పారు ప్రఖ్యాత నిర్మాత కాట్రగడ్డ మురారి. గతంలో ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. అదే విధంగా కొన్ని బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేశాయి. చాలా కాలం తర్వాత మురారి తాజాగా 'నవ్విపోదురు గాక అనే పుస్తకంతో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఈ పుస్తకం సినీప్రముఖుల సమక్షంలో చెన్నైలో విడుదలైంది. ప్రముఖ గాయని సుశీల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలువురు సినీ, సాహితీ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ బాలు మాట్లాడుతూ.. మాట కరకుగా కన్పించినా నవనీతమైన మనస్సున్న వ్యక్తి మురారి అని కితాబిచ్చారు. 'నవ్విపోదురుగాక' పుస్తకం కుండబద్దలు కొట్టగల ధైర్యానికి ప్రతీక అని మరికొందరు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆత్మకథల్లో భిన్నమైనది ఈ పుస్తకమని గొల్లపూడి మారుతీరావు అభిప్రాయపడ్డారు. తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే రెండో పుస్తకం ఇది అని వీఏకే రంగారావు చెప్పారు. ఈ కార్యక్రమానికి నటి శారద, పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్, రచయిత గణేశ్‌పాత్రో, గ్లోబల్ ఆసుపత్రి ఎండీ రవీంద్రనాథ్, వెన్నెలకంటి, ఘంటసాల రత్నకుమార్, చలసాని ప్రసాద్, పైడిపాల తదితరులు హాజరయ్యారు. ఇటీవల ప్రఖ్యాత నిర్మాత ఎమ్మెస్ రెడ్డి తన అనుభవాలతో రాసిన 'ఇదీ నా కథ' పుస్తకం పెద్ద దుమారమే రేపింది. ఈ పుస్తకాన్ని తర్వాత మార్కెట్లో దొరకకుండా చేశారు. తాజాగా నిర్మాత మురారి నవ్విపోదురుగాక పుస్తకం విడుదలకు ముందే టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. సినీ ప్రముఖుల్ని రోడ్డుకీడ్చిన ఈ పుస్తకం విడుదల తర్వాత ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: