ఈ శుక్రువారం విడుదల కాబోతున్న ‘బాహుబలి’ కి సంభందించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 15వ శతాబ్దo నాటి పరిస్థితులనేపధ్యంలో జరిగే ఈ సినిమా కధన లో అలనాటి నుండి ఈనాటివరకు సమాజాన్ని కుదిపేస్తున్న కులవ్యస్థ ప్రభావం పై కొన్ని ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయని వార్తలు అందుతున్నాయి. పేరుకు గ్రాఫిక్స్ తో కూడుకున్న జానపద సినిమానే అయినా సామజిక అంశాలను కూడ రాజమౌళి ఈ సినిమాలో లోతుగానే చూపించినట్లు టాక్.

ముఖ్యంగా ‘బాహుబలి’ లో శివుడు పాత్రను పోషిస్తున్న ప్రభాస్ నోటివెంట కుల వ్యవస్థ పై ఘాటైన డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది. అమరేంద్ర బాహుబలి కొడుకు అయిన శివుడు రాజకుటుంబానికి చెందిన వ్యక్తే అయినా కొండ ప్రాంతాలలో ఉండే అనాగరికుల మధ్య శివుడు పెరుగుతాడు కాబట్టి కుల వ్యవస్థ వివక్షత వల్ల వారుపడే బాధను చూడలేక వారి గురించి పోరాటం చేస్తూ తన అసలు జన్మ రహస్యాన్ని తెలుసుకుని వారి కోసం అగ్ర కులాల పై పోరాటం చేస్తాడని తెలుస్తోంది.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ సినిమాలో దేవసేన పాత్ర పోషిస్తున్న అనుష్క క్షత్రియ కన్య కాదు. కాని ఆమె పై ప్రేమతో అమరేంద్ర బాహుబలి పెళ్ళి చేసుకోవడంతో రాచ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తుతాయి. ఈ వార్తలను బట్టి ప్రభాస్ పోషిస్తున్న శివుడి పాత్ర పై మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఛాయలు ఉన్నట్లుగా అర్ధం అవుతోంది.

 ఇది ఇలా ఉండగా రెండు గంటల 40 నిముషాలు సాగే ‘బాహుబలి’ బిగినింగ్ పార్ట్ వన్ లో సుమారు 40 పేజీల డైలాగ్స్ మించి ఉండవని సినిమా అంతా కూడ ఒక విజువల్ టెల్లర్ గా సినిమాను చూసే ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచేస్తూ రాజమౌళి తన మాయను ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లోను చూపెట్టడంతో ప్రేక్షకులు మరో లోకానికి వెళ్ళిపోయినట్లు ఫీల్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. ఒక జానపద కథకు సామాజిక అంశాలను జోడించిన ఘనత కూడ ‘బాహుబలి’ ద్వారా రాజమౌళికి దక్కపోతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: