“నేను ఇంకా అధిరోహిస్తూనే ఉన్నాను. శిఖరం ఎక్కడ ఉంది ప్రభూ..నేను ఇంకా తవ్వుతూనే ఉన్నాను జ్ఞానాగారం ఎక్కడ ఉంది ప్రభూ” అని నిరంతరం పరి తపిస్తూ భారతదేశం కోసం ముఖ్యంగా ఈదేశ రేపటి తరం కోసం నిరంతరం ఆలోచనలు చేస్తూ కలలు కన్న భారత జాతి ముద్దు బిడ్డ క్షిపణి పితామహుడు అబ్దుల్ కలాం నిన్న సాయంత్రం మరణించడంతో విధ్యార్దులకు ‘కలలు కనండి ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ జ్ఞాన ప్రభోధాలను చేసిన జ్ఞాన మహర్షి కలాం మన నుండి శాస్వితంగా సెలవు తీసుకోవడం నేటి భారతదేశ యువతరానికి తీరని లోటు.

శాస్త్రవేత్తగా, రచయితగా భారత రాష్ట్రపతిగా ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన అబ్దుల్ కలాం కరెంట్ లేని తన సొంత ఇంటి నుండి తన ప్రస్థానం ప్రారంభించి రెండు వందల గదులతో ఉండే రాష్ట్రపతి నిలయానికి అధినేతగా అయ్యాడు అంటే పేపరు బాయ్ గా పనిచేసిన కలాం జీవితంలో ఆ ఎత్తుకు ఎదగడానికి ఎంత కృషి చేసాడో మనకు అర్ధం అవుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఎందరో రాష్ట్రపతులు రాష్ట్రపతి నిలయం నుండి తమపాలన సాగించారు. అయితే ప్రజలరాష్ట్రపతిగా 127 కోట్ల భారతీయుల హృదయాలలో శాశ్విత స్థానం ఏర్పరుచుకున్న ఘనత ఒక్క అబ్దుల్ కాలం కు మాత్రమే సొంతం.

రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిని అధిరోహించినా తనకు మాత్రం శాస్వితంగా ఉపాధ్యాయుడు లానే కొనసాగడం ఇష్టం అని తరుచూ చెప్పే అబ్దుల్ కలాం రేపటి తరానికి వారసులైన యువతకు ముఖ్యంగా పిల్లలకు ఎన్నో జీవిత సత్యాలను తన ఉపన్యాసాలలో రంగరించి చెపుతూ వారిని ఎల్లప్పుడూ చైతన్యవంతులను చేస్తూ ఉండేవారు. కష్టాలు అనేవి మనలను నాశనం చేయడానికి వచ్చినవి కాదు - మనలోని శక్తి సామధ్యాలను వెలికితీసే అవకాశాలుగా మార్చుకోవాలి అంటూ కలాం చెప్పే మాటలు వింటే చైతన్యవంతం కాని వ్యక్తి ఉండడు. 

విజయ గాధలు కాదు చదవవలసింది పరాజయ గాధలను చదవండి అప్పుడే విజయం ఎలా సాధించాలో తెలుస్తుంది అంటూ మనస్పూర్తిగా పనిచేయలేని వాడు జీవితంలో ఏమీ సాధించలేడు అని చెపుతూ యువతకు అనేక సార్లు ఉత్తేజం కలిగించడానికి ప్రయత్నించారు కలాం. మన విజయాన్ని అడ్డుకునేది మన ప్రతికూల ఆలోచనలే – మన భవిష్యత్తును మార్చేది మన అలవాట్లే అని జ్ఞాన ప్రభోధ చేస్తూ మనిషికి గౌరవం దక్కేది అతడి సామర్ధ్యంవలనే అంటూ రేపటి తరాన్ని – రేపటి భారతాన్ని ఊహించుకుంటూ అవినీతి రహిత భారతావని కోసం, పేదరికం, నిరక్షరాస్యతా లేని తాను కలలుకనే భారతదేశాన్ని ఊహించుకుంటూ జీవితాంతం యువతను జ్ఞానవంతులుగా చేయడానికి అనునిత్యం పోరాడిన కలాం ఆ కలల భారతావని కలలు సాకారం కాకుండానే సుదూర తీరాలకు వెళ్ళిపోవడం నేటి భారతదేశ యువతరానికి తీరని లోటు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: