దీపం తాను ఆరిపోతూ కూడా పది మందికి వెలుగు ఇస్తుంది... కటిక పేదరికాన్ని అనుభవించి.. ఎన్నో వడిదుడుకులను అధిగమంచి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహాను భావుడు  ఏపీజే అబ్దుల్ కలాం.. ఎంతో మందికి స్ఫూర్తిని నింపుతూ, ఆలోచనలను పంచుతూ, ఏ లక్ష్యమూ తెలియని కొన్ని లక్షల మందికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ప్రసంగాలిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. నిన్న సాయంత్రం కోట్లాది హృదయాలను కలవరపెడుతూ ఆయన తనువు చాలించిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అకాల మృతికి యావత్ భారతం కలత చెందగా పలువురు సినీ రంగ ప్రముఖులు సైతం కలాం మృతి పట్ల తీవ్ర కలత చెందారు.

అబ్దుల్ కలాం మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు సంతాపం ప్రకటించారు. ఆయన లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని, టాలీవుడ్ సెలబ్రిటీలు కలాం సేవల్ని పలువురు కొనియాడారు.  తెలుగు సినీ ప్రముఖులు అబ్దుల్ కలాం మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ ఆయన గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన కలాం అందరికీ ఆదర్శనీయుడని ,ఆయన మృతి దేశానికి తీరని లోటని ఆయన సేవలను కొనియాడారు. చిరంజీవి ,బాలకృష్ణ ,మోహన్ బాబు ,దాసరి నారాయణరావు ,మురళీమోహన్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాడ సంతాపాన్ని వెలిబుచ్చారు.

టాలీవుడ్ ప్రముఖులు


దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కలాంకు నివాళులు అర్పిస్తూ.. కలాం తమ కంటి చూపునకు మాత్రమే దూరమయ్యారని, కలలను సాకారం చేసుకునే ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఆయన ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటారని నివాళులు అర్పించారు. జాతి అంతటికీ కలాం మార్గదర్శకులని, ఆయనకు జాతి యావత్తూ రుణపడి ఉంటుందని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొనియాడారు. కాగా హీరో మహేశ్-బాబు కలాంకు నివాళులు అర్పిస్తూ.. శాస్త్రీయ పరిశోధన వైతాళికుడు అంటూ ప్రశంసించారు. కలాం మానవత్వానికి రోల్ మోడల్ అని ‘మా’ అధ్యక్షుడు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ అంజలి ఘటించారు. మన దేశం ఒక గొప్ప నేతను, సైంటిస్ట్-ను కోల్పోయిందని, కలాం అడుగుజాడల్లో మనందరం నడవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు.

కలాంకు తాను ఏకలవ్యశిష్యుడ్ని అంటూ నారా రోహిత్ అన్నారు. భారత దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిన ఘనత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంది అంటూ డైలాగ్ కింగ్ మంచు మోహన్-బాబు నివాళులు అర్పించారు. కలాం మృతి దేశానికి తీరని లోటు అంటూ నందమూరి బాలకృష్ణ, ఆయన ఓ స్ఫూర్తి దాయక నాయకుడంటూ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: