ఇంతకూ సినిమాను భారీతనపు హంగులు నడిపిస్తాయా... కథాబలం ఎమోషన్లు నడిపిస్తాయా? వందల కోట్ల రూపాయలు కుమ్మరించేస్తే.. అంతటితో కోరుకున్న ఫలితం వచ్చేస్తుందా? కేవలం కోట్ల రూపాయల పెట్టుబడి.. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్‌ పనితనం మాత్రమే సినిమాని ఆడిస్తాయా? దానికి కథాగమనం తోడుకావాల్సిన అవసరం లేదా.. తూకం ప్రకారం కొన్ని మసాలాలు మాత్రం దట్టించేస్తే సరిపోతుందా? సరైన కథ ఉంటే.. దాన్ని ఎమోషన్లు చెడిపోకుండా సరిగ్గా చెప్పగలిగితే... హంగుల్ని నమ్ముకోకుండా.. చేస్తే ఏమవుతుంది? ఇలాంటి అనేక రకాల సినీ ప్రశ్నలకు ప్రస్తుతం జవాబులు భారతీయ బాక్సాఫీసు మార్కెట్లో ఉన్నాయి. 


250 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్‌ అందించాం అని చెప్పుకున్న బాహుబలి చిత్రం తెలుగులో కనీసం మూడు వారాల పాటూ మరో చిత్రం రిలీజ్‌ కాకుండా రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లు అన్నిటినీ బ్లాక్‌ చేసి స్లాబ్‌ రేట్లతో ఆడిస్తే రికార్డు కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ.. భారతదేశంలో.. అతిపెద్ద మార్కెట్‌ అయిన బాలీవుడ్‌ ఒక రకంగా.. ఈచిత్రం ఎదురీదుతున్నట్లే అనుకోవాలి. ఇప్పటిదాకా 85 కోట్లు దాటుతున్నదని మాత్రమే మనం మురిసిపోతున్నాం. అయితే బాహుబలి కంటె చాలా ఆలస్యంగా విడుదల అయిన 'బజ్‌రంగీ భాయిజాన్‌' అప్పుడే అనగా రెండో వారం గడిచేరసరికే 250 కోట్ల కలెక్షన్లను దాటిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీఅభిమానుల మనసు దోచుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. 


అయితే అదే బాలీవుడ్‌లో బాహుబలి పప్పులు మాత్రం ఉడకలేదు. ఎంత భారీతనం ప్రదర్శించినా.. సల్మాన్‌ రికార్డుల్ని అది అధిగమించలేకపోయింది. ఇలాంటి వైఫల్యానికి కేవలం.. సల్మాన్‌ఖాన్‌కు అక్కడ స్టార్‌ ఇమేజి ఉండడమే కారణం అంటూ ఆత్మవంచన చేసుకుంటే కుదర్దు. ఇటీవలి కాలంలోనూ ఫ్లాప్‌ అయిన సల్మాన్‌ సినిమాలూ ఉన్నాయి. దీన్ని కేవలం సినిమాలోని కథా,కథన బలం సాధించిన విజయంగానే చెప్పుకోవాలి. తెలుగులో ముందే అనుకున్నట్లు.. చాలా రకాల కారణాల వల్ల బాహుబలి ఓ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే అందులో పాత్రల మధ్య ఎమోషన్లు పండలేదనేది వాస్తవం. కనీసం పాత్రల మధ్య సంబంధాలు ఏమిటో కూడా చాలా మందికి అర్థం కాలేదు. కథ అసంపూర్తిగా ఉన్నదనే అసంతృప్తి చూసిన ప్రతి ఒక్కరిలోనూ ఉండిపోయింది. అయినా అది మన సినిమా అనుకుని హిట్‌చేేశారు. కానీ బాలీవుడ్‌లో ఈ చిత్రం పట్ల అలాంటి 'మన' ఫీలింగ్‌ లేదు. సినిమా బాగుంటే (గ్రాఫిక్స్‌ కొలబద్ధ మీద కాదు.. బాగాలేదని కూడా కాదు) వారు కూడా పట్టంకట్టి ఉండేవారే. కానీ.. 'బజ్‌రంగీ..'లో ఓ హృద్యమైన కథను చెప్పిన తీరు.. ప్రేక్షకులను అమితంగా ఆట్టుకున్నదని తెలుసుకోవాలి. ఈ అనుభవాలనుంచి.. కథ పరిపూర్ణంగా ఉన్నప్పుడు.. దానికి గ్రాఫిక్స్‌ బలం తోడు చేయాలి గానీ.. వందల కోట్లతో గ్రాఫిక్స్‌ చేశాం గనుక ప్రజలు చూడాల్సిందే అని బ్లాక్‌మెయిల్‌ చేయడం కరెక్టు కాదని తెలుసుకోవాలి. బజ్‌రంగీ విజయం రాజమౌళి లాంటి పర్ఫెక్ట్‌ సినీ మేకర్‌కు కొత్త ఆలోచనలు ఇస్తుందని ఆశిద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: