ఒక కేసునుంచి సల్మాన్‌ ఖాన్‌ క్షేమంగానే బయటపడ్డాడు. ప్రస్తుతం ఎంచక్కా సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. అడపాదడపా.. దేశంలో వివాదాలకు కారణమయ్యే స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చుకుంటూ.. తన పేరు నిత్యం మీడియాలో కనిపించేలాగా చూసుకుంటున్నాడు. కాకపోతే.. ఇంకా అతని మీద కేసులు కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. కృష్ణజింకలను వేటాడిన కేసు ఇంకా సమసిపోలేదు. పైగా అది అంత ఆషామాషీ కేసు కూడా కాదు. ఈ నేపథ్యంలో తాజాగా పరిణామాల్ని గమనిస్తే.. సల్మాన్‌ఖాన్‌.. ఆ కేసుకు సంబంధించి సాక్షులందరినీ దువ్వేశాడని, అదులోంచి కూడా క్షేమంగా బయటపడడానికి అనుకూలంగా రంగం సిద్ధం చేసుకున్నాడని అనుమానాలు కలుగుతున్నాయి. 


తాజాగా కృష్ణజింకల వేటకు సంబంధించి కేసును విచారిస్తున్న రాజస్థాన్‌ హైకోర్టుకు సల్మాన్‌ ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. వేట కేసులో ఇదివరకు సాక్ష్యం చెప్పిన వ్యక్తులందరినీ పిలిపించి మళ్లీ సాక్ష్యాలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. మొత్తానికి ఆ పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. సల్మాన్‌కోరినట్లుగా.. ఐదుగురు సాక్షులను తిరిగి విచారించేందుకు సమన్లు జారీచేయనుంది. అంటే.. ఈలోగా ఆ అయిదుగురు సాక్షులను సల్మాన్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నాడేమో.. ప్రలోభపెట్టి అలా చేసుకున్నాడేమో.. అందుకే పునర్విచారణ కోసం పిటిషన్‌ వేసి ఉండచ్చు అని ఊహాగానాలు రేగుతున్నాయి. 


ఈకేసు మళ్లీ ఆగస్టు 19న విచారణకు వస్తుంది. కృష్ణ జింకలను అక్రమంగా వేటాడడం మాత్రమే కాదు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండడానికి కూడా సంబంధించిన కేసులు సల్మాన్‌పై నమోదై ఉన్నాయి. గతంలో మద్యం తాగి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం ద్వారా వ్యక్తి మరణానికి కారకుడు అయినందుకు కోర్టు శిక్ష విధించినా కూడా.. సల్మాన్‌ అందులోంచి ఎలాగో ఒకలాగ బయటపడగలిగారు. అందులోంచి తప్పించుకున్నా.. కృష్ణజింకల కేసు మళ్లీ కటకటాల పాల్జేస్తుందని అప్పట్లో అంతా అనుకున్నారు. ఇప్పుడు ఈ సాక్షుల పునర్విచారణ పేరిట ఆయన రిక్వెస్టు చేసిన డ్రామా ను గమనిస్తోంటే.. ఇందులోంచి కూడా ఈజీగానే బయటపడతాడేమో అని పలువురు ఊహిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: