ఏ శబ్దం నుంచి ఈ విశ్వం ఉద్భవించిందో ఆ శబ్దాన్ని గురువుగా భావించి సాధన చేయాలని మన వేదాలు చెపుతున్నాయి. అందుకే వేదాలకు ప్రామాణికం శబ్దం మాత్రమే. ఆశబ్దాన్ని ఉదాత్త అనుదాత్త స్వరాలతో గురువు తన శిష్యుడికి ఉపదేశిoచే విధానమే ‘గురుపూర్ణిమ’ ప్రాముఖ్యత అని అంటారు. ‘ఎవరు నాకు సహాయపదతారో, పరమాత్మను తెలుసుకునేందుకు ఎవరు దారి చూపుతారో, సర్వ కర్మలలో మనసు నిశ్చలంగా ఉండాలని ఎవరు ఉపదేశిస్తారో వారే నాగురువు’ అంటారు కబీర్ దాస్.

వ్యాసుడు పుట్టిన తిధిని గురుపౌర్ణిమిగా మనం అనాదికాలం నుండి జరుపుకుంటూ వస్తున్నాం. విష్ణుమూర్తి మానస పుత్రుడే వేదవ్యాసుడు అని మన పురాణాలూ చెపుతాయి. ఆ వ్యాస భగవానుడి జన్మదినం మన హైందవ సంస్క్రుతిలో ఒక ఆధ్యాత్మికమైన రోజుగా పరిగణిస్తూ మన గురువులను ఈరోజు స్మరించుకుంటాం. 

శ్రీరాముడుకి వసిష్ఠుడు, శ్రీకృష్ణుడుకి సాందీపుడు గురువులుగా వారి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దారో అందరికీ తెలిసిన విషయమే. మనిషి పరిపూర్ణత సాధించేది గురు సాన్నిధ్యంలోనే జరుగుతుందని స్వామి వివేకానంద అనేక సార్లు తెలియచేసారు. ‘తస్మై శ్రీ గురవేనమః’ అంటూ హలం పట్టుకున్నా కలం పట్టుకున్నా ఎదో ఒక సందర్భంలో ప్రతిమనిషి తన గురువును గుర్తుకు చేసుకుంటూనే ఉంటాడు.

గౌతమ బుద్ధుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తి లాంటి మహోన్నత వ్యక్తుల ఉపన్యాసాలలో గురువు ప్రాముఖ్యత గురించి వివరణాత్మకమైన అంశాలు ఉన్నాయి. గురు శిష్య సంబంధాలు సన్నగిల్లి ప్రపంచంలో విధ్యాబోధన అంతా ఆన్ లైన్ క్లాసులుగా మారిపోతూ ఉంటే గురు భక్తి గురించి గురువు ప్రాముఖ్యత గురించి నేటి తరానికి ఇంకా గుర్తు చేసే రోజుగా ఈగురుపూర్ణిమ మన హైందవ సంస్క్రుతిలో ఒక ప్రముఖమైన రోజుగా కొనసాగుతూనే ఉంది. మానవతా విలువలు నైతిక విలువలు ఇంకా పతనంకాకుండా మనిషి మనిషిగా తనను తాను తెలుసుకోవాలి అంటే ఇటువంటి గురుపౌర్ణిమి మనకు సరైన మార్గాన్ని తెలియచేస్తుందని ఆశిద్దాం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: