ఎవరైనా అడిగినప్పుడు మాత్రం.. నిర్మాత పాత్ర నాకు కొత్తదేమీ కాదు.. ఇదివరకు అన్నయ్య, అక్కయ్య సినిమాలకు కూడా నేను సహనిర్మాతగా చేశాను కదా... అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు గానీ.. అసలు నిర్మాత పాత్రలో ఉండే.. కష్టనష్టాలు ఏమిటో ఇప్పుడు తెలిసొస్తున్నదని మహేష్‌బాబు ఫీలవుతున్నాట్ట. ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతున్న శ్రీమంతుడు చిత్రానికి మహేష్‌ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. లాభనష్టాల ఎఫెక్టు తన మీద కూడా పర్సనల్‌గా ఉంటుంది గనుక.. ఆయన ఇప్పుడు సినిమా పబ్లిసిటీ మీద విపరీతంగా దృష్టి పెడుతున్నారు. 


కొన్ని రోజులుగా మహేష్‌బాబుకు వేరే పనేమీ లేదు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. టెన్షన్‌ పెరుగుతూ ఉంటుంది కదా. దానికి తోడు.. ప్రతిరోజూ మీడియా వాళ్లకు ఇంటర్వ్యూలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇలా రోజులు దొర్లించాల్సి వస్తోంది. ఇదివరకటి రోజుల్లో అయితే.. ఇంత పెద్ద సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఒక ఇంటర్వ్యూను ఫుల్‌లెంగ్త్‌ తామే చేయించేసి.. ఆ ఫుటేజీని అన్ని ఛానెళ్లకు ఇచ్చే వారు. ఆ ఛానెళ్ల వాళ్లు.. మధ్య మధ్యలో తమ యాంకర్‌తో ప్రశ్నలను అడిగించినట్లుగా ఎడిట్‌ చేసుకుంటూ.. సదరు ఫుటేజీని వాడుకుంటూ.. అదే ఇంటర్వ్యూ అనుకుని తృప్తి పడేవారు. తీరా చూస్తే.. అన్ని ఛానెళ్లలోనూ ఫుటేజీ పరంగా ఒకటే ఇంటర్వ్యూ ఉండేది. అయితే ఇప్పుడు మహేష్‌ మరింత కాన్సంట్రేట్‌ చేస్తున్నారు. ప్రతి ఛానల్‌ వారికి విడివిడిగా ఇంటర్వ్యూలకు సమయం కేటాయిస్తున్నాడు. నగరంలో ఓ కాస్ట్‌లీ హోటల్‌లో కొన్ని రోజులుగా ఇదే పనిలో ఉన్నట్లు సమాచారం. 


ఓ బహిరంగ సభ రేంజిలో ఇంటర్వ్యూల మేళా నిర్వహించి.. అన్ని పత్రికలూ మేగజైన్లు వెబ్‌సైట్ల వారికి ఇంటర్వ్యూలు విడివిడిగా పదేసినిమిషాలు ఇచ్చేసాడు. అయితే అడిగే మనుషులు మారుతారు గానీ.. ప్రశ్నలు దాదాపుగా ఒకేతీరుగా ఉండేవే. ప్రతి వాడికీ చెప్పిందే.. మళ్లీ ఇంకొకరికి చెబుతూ.. ఇలా ప్రతి వాడితోనూ ఎక్స్‌క్లూజివిటీ పేరిట చెప్పిందే చెబుతూ మహేష్‌కు చిరాకెత్తిపోయిందిట. నిర్మాత బాధ్యత ఎత్తుకున్నందుకు ఇన్ని కష్టాలు పడాలా అనుకుంటున్నాడట పాపం ఈ మిల్కీబాయ్‌!!


మరింత సమాచారం తెలుసుకోండి: