పూరిజగన్నాథ్ లాంటి దర్శకుడు  ఒక సినిమా తీస్తూ ఉండగానే మరో హీరోతో తాను చేయబోయే కథ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సక్సస్ ను క్యాష్ చేసుకోవడంలో పూరీకి తెలిసిన విద్య కొరటాల శివకు తెలియదేమో అని అనిపించడం సహజం. ‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా కొరటాల శివ నుండి మరొక సినిమా రాలేదు. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత కొరటాల మహేష్ ను ‘శ్రీమంతుడు’ గా తీసుకువస్తున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొరటాల జూనియర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ‘శ్రీమంతుడు’ తరువాత మీ తరువాత సినిమా ఎప్పుడు ? అని  ఆమీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ గత సంవత్సర కాలంగా ‘శ్రీమంతుడు’ టెన్షన్ తో తాను సరిగ్గా నిద్రపోవడంలేదు అని జోక్ చేస్తూ ఈ సినిమా విడుదల తరువాత కొంత రెస్ట్ తీసుకుని తన తదుపరి సినిమా విషయం గురించి ప్రకటిస్తాను అని చెప్పాడు కొరటాల.

ఇదే సందర్భంలో తాను జూనియర్ తో ఒక సినిమాకు దర్శకత్వం వహించ బోతున్నట్లుగా వస్తున్న వార్తల పై స్పందిస్తూ జూనియర్ తనకు చాల సన్నిహిత మిత్రుడు అని అతడితో ‘బృందావనం’ సినిమా తీసిన నాటి నుండి తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిన విషయాన్ని చెపుతూ తాను జూనియర్ ని కలిసినప్పుడల్లా అతడికి సినిమా కథలు వినిపిస్తూ ఉంటే ఆ కథలను వింటూ ‘సినిమాలలోకి వచ్చిన తరువాత ఏమైనా పొదుపు చేసావా?’  అంటూ వింతగా తన పై అభిమానంతో జూనియర్ ప్రశ్నిస్తూ ఉంటాడని తనకు జూనియర్ తో గల సాన్నిహిత్యాన్ని తెలియచేసాడు.

అయితే జూనియర్ తో ఒక సినిమా ఖచ్చితంగా అతిత్వరలోనే ఉంటుంది అని కొరటాల శివ చెప్పిన మాటలు బట్టి వచ్చే సంవత్సరం వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది అన్న సంకేతాలు అందుతున్నాయి. ఏది ఎలా ఉన్నా ‘శ్రీమంతుడు’ విజయం పై కొరటాల శివ కెరియర్ ఆధార పడింది అన్నది వాస్తవం..


మరింత సమాచారం తెలుసుకోండి: