మరొక ఆరు రోజులలో విడుదల కాబోతున్న ‘శ్రీమంతుడు’ సినిమా ఫీవర్ మీడియాను షేక్ చేస్తోంది. ఈరోజు అన్ని ప్రముఖ పత్రికలు మరియు ఛానల్స్ మహేష్ ఇంటర్వ్యూలతో నిండిపోయాయి. ఇది చాలదు అన్నట్లుగా మహేష్ ఎప్పుడూ లేని విధంగా మహేష్ తన ట్విటర్ ద్వారా తన అభిమానులతో సంభాషించాడు. 

అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు మహేష్ తనదైన రీతిలో సూటిగా సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంలో ఒక అభిమాని ‘పవన్ తో సినిమా చేస్తారా’ అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘వై నాట్’ అంటూ తాను పవన్ తో ఒక మల్టీ స్టారర్ చేయడానికి తాను రెడీ అంటూ సంకేతాలు ఇచ్చాడు. 

మరొక అభిమాని అక్కినేని కుటుంబ సినిమా ‘మనం’ సినిమాలా ‘మీ ఘట్టమనేని కుటుంబంలోని కృష్ణ, గౌతమ్ లతో కలిసి ఎప్పుడు నటిస్తారు?’ అన్న ప్రశ్న పై స్పందిస్తూ ‘మంచి కథ కోసం చూస్తున్నాను’ అంటూ తమ కుటుంబం నుండి కూడ ఒక కుటుంబ సినిమా రాబోతోంది అన్న సంకేతాలు ఇచ్చాడు మహేష్. 

మరొక అభిమాని ‘శ్రీమంతుడు మీ కెరియర్ కు ఎంత క్రూషియల్?’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ ‘ప్రతి శుక్రువారం ప్రతి హీరోకు క్రూషియల్ నా వన్, ఆగడు సినిమాలు ఆడలేదు కాబట్టి శ్రీమంతుడు కూడ నాకు క్రూషియల్’ అంటూ నిజాన్ని ఎటువంటి గందరగోళం లేకుండా ఒప్పుకున్నాడు మహేష్. మన ఇరు రాష్ట్రాలలోని మహేష్ అభిమానులే కాకుండా అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలలోని మహేష్ అభిమానులే కాకుండా తమిళనాడు, కర్నాటక నుంచి  అనేక మంది ఈ ట్విటర్ చాటింగ్ లో అనేక రకాల ప్రశ్నలు అడిగి మహేష్ నుండి పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టారు..



మరింత సమాచారం తెలుసుకోండి: