విలక్షణ నటుడు, నిర్మాత మోహన్‌బాబు.. భారతప్రభుత్వం తనకు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి సాధించుకున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు, ఆ అవార్డు పట్ల పాటించాల్సిన విధివిధానాలు తెలియకపోవడం వల్ల జరిగిన పొరబాటును దిద్దుకున్నారు. దానికి సంబంధించి తన పద్మశ్రీని రద్దు చేస్తూ వచ్చిన నిర్ణయంపై న్యాయపరంగా పోరాడి, ప్రభుత్వం అందించిన బిరుదును తిరిగి దక్కించుకున్నారు. 


గతంలో... మోహన్‌బాబు నటించిన చిత్రాల టైటిల్‌ కార్డ్స్‌లో ఆయన పేరు ముందు పద్మశ్రీ అని వేసుకుంటున్నారని, అలా వేసుకోవడం నిబంధనలకు విరుద్ధం అని.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే పిటిషన్‌ హాస్యనటుడు బ్రహ్మానందం విషయంలో కూడా దాఖలైంది. అయితే వీరిద్దరూ కూడా సినిమా నిర్మాతలు తమకు తెలియకుండానే.. టైటిల్స్‌ తమ పేరుకు ముందు పద్మశ్రీ తగిలించారని వాదించారు. బ్రహ్మానందం విషయంలో ఆ వాదనను పరిశీలించినప్పటికీ.. విష్ణు నిర్మించిన ఆ చిత్రానికి నిర్మాతగా మోహన్‌బాబు పేరు కూడా ఉంటుంది గనుక.. ఆయనకు ఆ వాదన ఉపయోగపడలేదు. దీంతో హైకోర్టు ఆయన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేయాలంటూ ఆదేశించింది. 


దీనిపై మోహన్‌బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయపరంగా పోరాడారు. తెలియక చేసిన పొరబాటు అని, భవిష్యత్తులో ఇంకెప్పుడూ పద్మశ్రీని దుర్వినియోగం చేయనని ఆయన సుప్రీం న్యాయస్థానానికి అఫిడవిట్‌ కూడా సమర్పించారు. దాంతో హైకోర్టు తీర్పును పక్కన పెట్టి.. మోహన్‌బాబు పద్మశ్రీని కొనసాగించాలని సుప్రీం తీర్పు చెప్పింది. దీంతో మోహన్‌బాబు అభిమానులందరిలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: