చిరంజీవితో తన వందో చిత్రం చేయాలని ఉన్నదని ఒకప్పటి స్టార్‌ డైరక్టర్‌ కోదండరామిరెడ్డి తాజాగా తన అభిలాషను వ్యక్తం చేశారు. నిజానికి ఇది చాలా దర్మసమ్మతమైన కోరిక. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడంలో కోదండరామిరెడ్డి పాత్ర కూడా చాలా ఉంది. చిరు బ్లాక్‌బస్టర్‌లు అనదగిన అనేక చిత్రాలను ఆయనే రూపొందించారు. కాబట్టి తన వందో చిత్రం చిరుతోనే చేయాలని ఆయన కోరుకోవచ్చు. కానీ ఆ కోరిక విన్నవారికి సబబే అనిపిస్తోంది గానీ.. అది ఎప్పటికి తీరుతుంది అని వెంటనే సందేహం కలుగుతోంది

నిజానికి దర్శకులు వంద చిత్రాల మైలురాయిని అందుకోవడం చాలా కష్టసాధ్యం అయిన ఈ రోజుల్లో.. నిన్నటితరం దర్శకుడు గనుక.. కనీసం కోదండరామిరెడ్డికి ఆ వెసులు బాటు ఉంది. ఆయన తరంలో సమకాలీనులైన దిగ్దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కెఎస్‌ఆర్‌ దాస్‌ లాంటి వాళ్లంతా సదరు సెంచరీ మైలురాయిని దాటిన వాళ్లే. కోదండరామిరెడ్డి ఒక్కరే ఆ మార్కు అందుకోకుండా మిగిలిపోయారు. ఆయన ఇప్పటికి 93 చిత్రాలు పూర్తి చేశారు. అంతవరకూ వచ్చిన తర్వాత.. ఇక 100 కొట్టేస్తే బాగుంటుందని ఎవరికైనా మోజు పుడుతుంది. కోదండరామిరెడ్డి అందుకు అతీతులేమీ కాదు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆయన మెగాఫోన్‌కు దూరంగా ఉన్నారు. 


ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన వందో చిత్రాన్ని పూర్తిచేయాలనే ఆకాంక్షను వ్యక్తంచేస్తూనే దాన్ని కాస్తా చిరంజీవితో చేయాలని ఉన్నదనడం ఆసక్తికరమే. కోదండరామిరెడ్డి చేసిన 93 చిత్రాల్లో 27 ఆల్రెడీ చిరంజీవివేనట. వాటిలో చాలా మటుకు సూపర్‌హిట్లే అని వేరే చెప్పక్కర్లేదు. చిరంజీవి ఇప్పుడు తన 150 చిత్రానికే కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటున్నాడు. కోదండరామిరెడ్డి మిగిలిన 6 చిత్రాలను ఎన్ని సంవత్సరాలకు పూర్తిచేస్తారో తెలియదు. ఆ తర్వాత 100 చిత్రం చేస్తానని చిరు వద్దకు వెళ్లే సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే ఈ కాంబినేషన్‌ మీద చాలా మందికి మోజున్నా.. అది సాధ్యమేనా అని అనుమానం కలుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: