బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ఖాన్‌పై మూడేళ్లుగా ఉన్న నిషేధం తొలగిపోయింది. ఇదేదో సినిమాలకు సంబంధించిన నిషేధం కాదు. ముంబాయిలోని వాంఖెడే స్టేడియంలోకి అడుగుపెట్టకుండా షారూఖ్‌ పై గతంలో విధించిన నిషేధాన్ని ముంబాయి క్రికెట్‌ అసోసియేషన్‌ ఉపసంహరించుకుంది. ఐపీఎల్‌ కోల్‌కత జట్టు యజమాని అయిన షారూఖ్‌ గతంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భంగానే.. స్టేడియం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు ఈ నిషేధానికి గురయ్యాడు. నిజానికి ఆయనమీద అయిదేళ్ల నిషేధాన్ని విధించిన ముంబాయి క్రికెట్‌ అసోసియేషన్‌ మూడేళ్లకే దానిని ఎత్తివేసింది. దీనికి సంబంధించి ఎంసీఏకు షారూఖ్‌ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నారు. 


2012లో వాంఖెడెలో కోల్‌కత ముంబాయి జట్ల మధ్య మ్యాచ్‌ జరిగినప్పుడు.. షారూఖ్‌ భద్రతా సిబ్బందితో గొడవపడ్డారు. దానిపై విచారించిన ఎంసీఏ మేనేజింగ్‌ కమిటీ.. ఆయన మీద అయిదేళ్లపాటూ నిషేధాన్ని విధించింది. అయితే తాను ఎవ్వరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని, సెక్యూరిటీ సిబ్బంది పసిపిల్లలను కొట్టడం వల్లే.. తాను స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. 


తాజాగా 'ఆయన మీద చర్య తీసుకున్నాం.. దీన్ని మరింత దూరం తీసుకువెళ్లడం మేనేజింగ్‌ కమిటీలో ఎవ్వరికీ ఇష్టం లేదు' అంటూ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దీనికి ముందు షారూఖ్‌ ఖాన్‌, శరద్‌ పవార్‌కు ఫోను చేసి తన మీద నిషేధం ఎత్తేయించాల్సిందిగా కోరినట్లు సమాచారం. తన మీద నిషేధం ఎత్తేసినందుకు షారూఖ్‌ ప్రత్యేకంగా ఎంసీఏ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: