మీ ఆదాయం నెలకు ఎంత.. ఆ సంపాదన రోజుకు ఎంతో ఓసారి లెక్కేసుకున్నారా.. మహా అయితే రోజుకు 5 వేలో..ఆరు వేలో అయి ఉంటుంది. ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ కింగులైతే.. రోజుకో లక్ష ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా కాకుండా రోజుకు లక్షల్లో సంపాదన ఉండాలంటే.. ఏ హాలీవుడ్ స్టారో అయి ఉండాల్సిందే.. అవును మరి.. జెన్నిఫర్ లారెన్స్ అనే అమ్మడి సంపాదన రోజుకు దాదాపు 90 లక్షలకు పైగానేనట. 

పాతికేళ్ల ఈ ముద్దుగుమ్మ ఒక్క ఏడాదిలో దాదాపు రూ.338 కోట్లు సంపాదిస్తూ... ఫోర్బ్స్ మేగజైన్ రికార్డుల్లోకెక్కేసింది. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణిగా రికార్డ్ క్రియేట్ చేసింది. గత ఏడాది ఆమె ఆదాయం 52 మిలియన్ డాలర్లట. ద బిల్ ఇంగ్వాల్ షో చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు..2010లో వింటర్స్ బోన్ చిత్రానికి గాను అకాడమీ అవార్డు అందుకుని సత్తా చాటింది. 

2012లో ప్రారంభమైన హంగర్ గేమ్స్ ఫిల్మ్ సిరీస్ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఈ సీరిస్ ద్వారానే ఆమె ఈ అరుదైన రికార్డు సంపాదించేసింది. సినిమాలతో పాటు అటు వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నట్టు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. జెన్నిఫర్ లారెన్స్ తర్వాత రెండోస్థానంలో 35.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో స్కార్లెట్ జొహాన్సన్ నిలిచింది. నటులలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రాబర్ట్ డౌనీ జూనియర్ నిలిచాడు. ఇతని ఆదాయం 80 మిలియన్ డాలర్లు. 

జెన్నిఫర్ లారెన్స్.. సంపాదనలోనే కాదు.. సమాజసేవలోనూ ముందే ఉంది. సంపాదించిన సొమ్మును సమాజానికి ఉపయోగపడే కార్యాలకు ఉపయోగిస్తూ ఈ ముద్దుగుమ్మ తానో మంచి మనిషినని రుజువు చేసుకుంటోంది. తన పేరుతో ఓ ట్రస్టు నెలకొల్పి సమాజ సేవ కూడా చేస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: