పవన్  పేరు చెపితే బాక్సాఫీస్ రికార్డులు  బద్దలు అవుతాయి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. పవన్ కు అభిమానులు ఉండరు. పవన్ కు ఉన్నవారు అంతా భక్తులే. టాలీవుడ్ లో ఎందరు టాప్ హీరోలు ఉన్నా రియల్ హీరో మాత్రం ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. తనదైన బాణీతో విభిన్నమైన వ్యక్తిత్వంతో టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ గత 19 సంవత్సరాలుగా నటించిన సినిమాలు సంఖ్యలో కేవలం 22 మాత్రమే అయినా రెండు దశాబ్దాలుగా పవన్ తన విలక్షణమైన వ్యక్తిత్వంతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా కొనసాగుతూనే ఉన్నాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేనిది పవన్ టాలీవుడ్ కెరియర్. పవన్ సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు ఆలస్యం అయినా అతడి అభిమానులు ఎదురు చూస్తూనే ఉంటారు. 

వయసుతో సంబంధం లేకుండా అందరు పవన్ విషయాల గురించి, పవన్ వార్తలు గురించి మాట్లాడుకోకుండా ప్రస్తుతం ఒక్క రోజుకూడ గడవడం లేదు అంటే అతిశయోక్తి కాదు. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు చిరంజీవి తమ్ముడిగా పరిచయం అయి తనలోని విలక్షణమైన నటనతో పవర్ స్టార్ గా మారిపోయాడు. పవన్ కెరియర్ లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో వాటితో సమానంగా సూపర్ ఫ్లాప్స్ కూడ ఉన్నాయి. అయినా ఎటువంటి సూపర్ ఫ్లాప్ లకు పవన్ చలించడు. తన టాప్ హీరో స్టేటస్ పోతుంది అన్న భయం కూడ పవన్ లో కనిపించదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అర్ధంకాని విషయాలు పవన్ వ్యక్తిత్వంలో కనిపిస్తాయి. 

అందుకే కాబోలు శ్రీకాంత్ అనే వీరాభిమానికి పవన్ ను అర్ధం చేసుకుని ఒక పుస్తకం వ్రాయడానికి 18 సంవత్సరాలు పట్టింది. అంతేకాదు ఒక వ్యక్తి పేరుతో అతడి అభిమానులు ఒక ఇజాన్ని సృష్టించి దానికి ‘పవనిజమ్’ అన్న పేరు పెట్టి ఎవరికి వారే ఈ పవనిజాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారు అంటే పవన్ పేరులో ఎంత పవర్ ఉందో అర్ధం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఆలోచనలను నిశితంగా పరిశీలించిన వారికి రమణ మహర్షి చెప్పిన ‘నీలో నువ్వు ప్రయాణించి నిన్ను నువ్వు తెలుసుకో’ అన్న మాటలు గుర్తుకు వస్తాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఆవేశంతో పాటు ఈ సమాజం పట్ల పవన్ కు ఉన్న తపన కూడ కనిపిస్తుంది. 

తెలుగు సినిమా రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో  ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అంతేకాదు అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకడు. తన సినిమాలకే కాదు చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు కూడ పవన్ కళ్యాణ్ ఫైట్ లని రూపొందించాడు. మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట కావడంతో పవన్ తొలి రోజులలో చేసిన సినిమాల స్టంట్స్ నిజంగా చేసినట్లే ఉంటాయి. ‘అత్తారింటికి దారేది’ సినిమా ఘన విజయం కూడ పవన్ విషయంలో ఎటువంటి మార్పులు తీసుకు రాలేదు. అటువంటి బ్లాక్ బస్టర్ హిట్ మరొక హీరోకి వచ్చి ఉంటే ఈ పాటికి కనీసం పది సినిమాలు అయినా నటించి వందల కోట్లు సంపాదించి ఉండేవారు. కాని పవన్ ఆ సినిమా ఘనవిజయం తరువాత నటించిన ఒకే ఒక్క సినిమా ‘గోపాల గోపాల’. 

మార్చి 14, 2014 పవన్ జీవితంలో మరో మలుపు తిరిగింది. అదే ‘జనసేన’ పార్టీ ఆవిర్భావం . ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో పవన్ బలపరిచిన భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా ఆ విజయం తనకు ఏమి సంబంధం లేదు అనే విధంగా ప్రవర్తిస్తూ అసలు ‘జనసేన’ పార్టీని పవన్ ఎందుకు స్థాపించాడో పవన్ అభిమానులకే అర్ధంకాని విషయంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాలలో పవన్ ఎత్తుగడలు ప్రస్తుతం ఎవరకీ అర్ధం కాని విషయమే అయినా హీరోయిజమ్ అంటే మాత్రం అందరికీ గుర్తుకు వచ్చేది ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే. ఎటువంటి అధికారాన్ని, పదవులను ఆశించకుండా ఎన్నికలలో పోటీ చేయకపోయినా “పవర్ కళ్యాణ్” గా  నేటి రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ జీవితం రానున్న రోజులలో ఇంకా ఎన్ని అద్భుతాలకు చిరునామా అవుతుందో పవర్ స్టార్ కే తెలియాలి _  టాలీవుడ్ ఎంపరర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎపి హెరాల్డ్ పుట్టినరోజు శుభాకాంక్షలు..



మరింత సమాచారం తెలుసుకోండి: